Let's talk: editor@tmv.in
దేశంలో 80 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశంలో 80 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Gaddamidi Naveen
9 జూన్, 2026

దేశంలో విద్యుత్ ఉత్పత్తి అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 80 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం ప్రకటించారు. 2014 నుంచి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున, భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే, ముందస్తు జాగ్రత్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు 80 రోజులకు సరిపడేలా భారీ స్థాయిలో బొగ్గు నిల్వలను సిద్ధంగా ఉంచామని, కాబట్టి దేశంలో ఎలాంటి విద్యుత్ కొరత రాబోదని ఆయన స్పష్టం చేశారు.

గత యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు రంగం అనేక అవినీతి కుంభకోణాలతో సతమతమైందని కిషన్ రెడ్డి ఆరోపించారు. గత 12 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం బొగ్గు, గనుల రంగంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణల వల్ల దేశీయంగా బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. దేశంలో ప్రస్తుతం ఏటా రికార్డు స్థాయిలో 1,040 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోందన్నారు. ఈ బొగ్గు రంగం ద్వారా ప్రస్తుతం 5 లక్షల మందికి ప్రత్యక్షంగా, 25 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మొత్తంగా గనుల రంగంలో దాదాపు 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి, వినియోగంలో భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా అవతరించిందని పేర్కొన్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉండగా, ‘కోల్ ఇండియా లిమిటెడ్’ ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా కొనసాగుతోందని, దేశంలో దాదాపు 70 శాతం విద్యుత్ ఉత్పత్తి బొగ్గు ఆధారంగానే జరుగుతోందని మంత్రి గుర్తుచేశారు.

గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు

బొగ్గును క్లీనర్ ఇంధనంగా మార్చే ‘కోల్ గ్యాసిఫికేషన్’ ప్రాజెక్టుల ఫలితాలు రాబోయే రెండేళ్లలో దేశ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి తెలిపారు. ఈ పథకాన్ని మరింత ప్రోత్సహించడానికి ముంబై, హైదరాబాద్ ఇతర ప్రధాన నగరాల్లో త్వరలోనే రోడ్‌షోలను నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది మే నెలలో కేంద్ర కేబినెట్ రూ.37,500 కోట్ల భారీ ప్రోత్సాహక బడ్జెట్‌తో ఈ కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ సాంకేతికత ద్వారా బొగ్గును 'సిన్‌గ్యాస్' గా మారుస్తారు. దీనిని స్వచ్ఛమైన ఇంధనాలు, రసాయనాలు, ఎరువులు హైడ్రోజన్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. దీనివల్ల దేశానికి ఎల్పీజీ, యూరియా, మిథనాల్ దిగుమతుల భారం తగ్గి, అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ లభిస్తుంద‌ని పేర్కొన్నారు.

దేశ ఆర్థిక భద్రతకు అవసరమైన ‘క్రిటికల్ మినరల్స్’ (కీలక ఖనిజాలు) గుర్తింపు, అన్వేషణ పనులను కేంద్రం వేగవంతం చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. అన్వేషణ పూర్తయిన ప్రాంతాల్లో ఇప్పటికే వేలం ప్రక్రియ ప్రారంభమైందన్నారు. అర్జెంటీనా దేశంలో భారత్ కొనుగోలు చేసిన క్రిటికల్ మినరల్ బ్లాకులలో అన్వేషణ పనులు ప్రారంభమయ్యాయని, వీలైనంత త్వరలోనే అక్కడ ఉత్పత్తి మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ప్రాసెస్ చేసిన లేదా సెమీ-ప్రాసెస్ చేసిన కీలక ఖనిజాలను భారతదేశంలోకి దిగుమతి చేసుకునేలా ప్రైవేట్ భాగస్వాములను కేంద్రం ప్రోత్సహిస్తోందని చెప్పారు.

మరోవైపు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా పాడుబడిన సుమారు 143 బొగ్గు గనులను శాస్త్రీయ పద్ధతిలో మూసివేయడానికి కార్యాచరణను ప్రారంభించామని మంత్రి తెలిపారు. 2028 నాటికి ఈ గనులన్నింటినీ పూర్తిగా సురక్షితంగా మూసివేసే ప్రక్రియ పూర్తవుతుందని కిషన్ రెడ్డి వివరించారు.

దేశంలో 80 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - Tholi Paluku