Let's talk: editor@tmv.in
నేడు ముంబైలో బొగ్గు గనుల వేలం

నేడు ముంబైలో బొగ్గు గనుల వేలం

Shaik Mohammad Shaffee
17 ఏప్రిల్, 2026

దేశ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నేడు మరో కీలక అడుగు వేస్తోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో 15వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని శుక్రవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్ ముఖ్య అతిథిగా హాజరై వేలం ప్రక్రియను ప్రారంభిస్తారు.

పెట్టుబడులకు స్వర్గధామం

వ్యాపారాలను సులభతరం చేసే ఉద్దేశంతో అత్యంత సరళమైన నిబంధనలతో ఈ వేలం నిర్వహిస్తున్నారు. ఈ విడతలో పూర్తిగా అన్వేషించిన గనులతో పాటు, పాక్షికంగా అన్వేషించిన బొగ్గు బ్లాకులను కూడా ప్రభుత్వం వేలానికి ఉంచింది. దీనివల్ల అనుభవం ఉన్న మైనింగ్ సంస్థలతో పాటు కొత్తగా ఈ రంగంలోకి వచ్చే స్టార్టప్‌లు, అత్యాధునిక సాంకేతిక సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

దిగుమతుల భారం తగ్గడమే లక్ష్యం

ప్రధాని మోడీ 2020లో ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల దేశంలో బొగ్గు ఉత్పత్తి బాగా పెరిగింది. ఇప్పుడు జరుగుతున్న 15వ విడత వేలం ద్వారా విదేశాల నుండి బొగ్గును కొనుగోలు చేసే అవసరం తగ్గి, దేశానికి బోలెడంత ధనం ఆదా అవుతుంది. కొత్తగా బొగ్గు గనులు ఏర్పాటు కావడం వల్ల వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈ వేలం ప్రక్రియను ఎంతో నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించడం వల్ల వ్యాపారవేత్తలకు ప్రభుత్వంపై నమ్మకం పెరగడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

పరిశ్రమ వర్గాలతో ముఖాముఖి

వేలం ప్రారంభం సందర్భంగా "ఆత్మనిర్భర్ భారత్: ఇంధన భద్రత కోసం బొగ్గు" అనే అంశంపై పరిశ్రమ ప్రతినిధులు, వాటాదారులతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. వారి సలహాలు, సూచనల మేరకు బొగ్గు రంగాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఇంధనాన్ని అందించడం, పరిశ్రమలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరాను కొనసాగించడం వంటి అంశాలపై నేటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.