
తమిళనాడులో 717 మద్యం దుకాణాల మూసివేతకు సీఎం విజయ్ ఆదేశం
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధం దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలు, పలు రాజకీయ పార్టీల డిమాండ్ల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.
వచ్చే రెండు వారాల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 500 మీటర్ల పరిధిలోని మొత్తం 717 దుకాణాల్లో 276 మద్యం షాపులు ప్రార్థనా స్థలాల సమీపంలో ఉన్నవి కాగా, 186 దుకాణాలు విద్యాసంస్థల సమీపంలో, మరో 255 దుకాణాలు బస్ స్టాండ్ల పరిసరాల్లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ చర్యలపై మహిళా సంఘాలు, అలాగే పీఎంకే వంటి కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలని గతంలో నుంచే డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టీఎఎస్ఏ్ంఎసీ) ఆధ్వర్యంలో మొత్తం 4,765 రిటైల్ దుకాణాలు నడుస్తున్నాయి.
ప్రతిపక్షాల విమర్శలు
ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష డీఎంకే తప్పుబట్టింది. ఇది కేవలం "ప్రజా సంబంధాల జిమ్మిక్కు" మాత్రమేనని ఎద్దేవా చేసింది. విద్యాసంస్థలు, మతపరమైన ప్రార్థనా స్థలాల వద్ద అసలు దుకాణాలే లేవని, కొత్తగా షాపులు తెరిచి వాటిని మూసివేస్తున్నారా? అని డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై ప్రశ్నించారు.
ఆదాయంపై ప్రభావం
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం విక్రయాలు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. 2025 సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రానికి రూ. 48,344 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం టీఎఎస్ఏ్ంఎసీ ద్వారా విదేశీ బ్రాండ్లతో సహా మొత్తం 551 రకాల మద్యం బ్రాండ్లు విక్రయించబడుతుండగా, వాటిలో 223 వైన్ బ్రాండ్లు లైసెన్స్ పొందిన రిటైల్ దుకాణాల్లో అమ్మకానికి ఉన్నాయి. ఈ మూసివేత నిర్ణయం భవిష్యత్తులో పూర్తిస్థాయి మద్యపాన నిషేధానికి నాంది పలుకుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
