Let's talk: editor@tmv.in
ప్రధాని మోడీ తో సీఎం రేవంత్ కీలక భేటీ
ప్రధాని మోడీ తో సీఎం రేవంత్ కీలక భేటీ

ప్రధాని మోడీ తో సీఎం రేవంత్ కీలక భేటీ

Dantu Vijaya Lakshmi Prasanna
12 జూన్, 2026

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధానమంత్రిని కలిసిన సీఎం, రాష్ట్ర అభివృద్ధి, రవాణా, విద్య, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలను సమర్పించారు.

ముఖ్యంగా గోదావరి జలాల వినియోగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం కోరారు. రాష్ట్ర భవిష్యత్ సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి అనుకూల వాతావరణం కల్పించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రతిపాదనలను కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపట్టేందుకు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో (జాయింట్ వెంచర్) అమలు చేయాలని కోరారు.

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టుకు తక్షణ ఆమోదం ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఉత్తర భాగం భూసేకరణ వ్యయంలో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐకి రూ.626 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించి 90 శాతానికి పైగా భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం నిర్మాణం కూడా రాష్ట్రానికి సమానంగా కీలకమని సీఎం పేర్కొన్నారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ కారిడార్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ చుట్టూ రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వివరించారు. ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు.

హైదరాబాద్–అమరావతి–బందర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదనకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వాలని సీఎం అభ్యర్థించారు. 12 లేన్లతో, 120 మీటర్ల రైట్ ఆఫ్ వేతో నిర్మించనున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే తెలంగాణకు సముద్ర తీర పోర్టులతో ప్రత్యక్ష అనుసంధానాన్ని కల్పిస్తుందని చెప్పారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఎగుమతులకు ఇది కీలకంగా మారుతుందని వివరించారు.

వరంగల్ విమానాశ్రయం అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని కూడా సీఎం ప్రధానమంత్రిని కోరారు. విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పూర్తిచేసి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు తెలిపారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.

అదేవిధంగా హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఐఐఎం స్థాపనకు అవసరమైన 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, టీఐఎఫ్‌ఆర్ వంటి ప్రముఖ జాతీయ విద్యాసంస్థలు ఉన్నాయని, ఐఐఎం ఏర్పాటు ద్వారా జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యాల సాధనకు తోడ్పాటు అందుతుందని ప్రధానమంత్రికి వివరించారు.

రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టులపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో రవాణా, పారిశ్రామిక, విద్యా, సాగునీటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.