
ముస్లింలను రెచ్చగొట్టి ‘సర్’ ప్రక్రియను అడ్డుకోవాలని సీఎం రేవంత్ ప్రయత్నం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ముస్లింలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-సర్) ప్రక్రియను అడ్డుకోవాడమే లక్ష్యంగా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ పాతబస్తీలో బూత్ స్థాయి అధికారులను (బీఎల్‌వోలు) ఇంటింటి సర్వే చేయకుండా ఏఐఎంఐఎం పార్టీ బెదిరిస్తోందని, ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీకి పూర్తిగా సహకరిస్తున్నాయని మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం, స్వయంగా ముఖ్యమంత్రే ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ముస్లింల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే ఓట్లను కోల్పోతారు అంటూ ముస్లింలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి, ఓటర్ల సవరణ ప్రక్రియకు మతాన్ని ముడిపెట్టి ఆటంకం కలిగించడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని
కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని పలు నివాస ప్రాంతాలలో రోహింగ్యాలతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన వారు కూడా ఓటరు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పత్రాలను కలిగి ఉన్నారని, అయితే బీజేపీయేతర పార్టీలన్నీ ఈ తీవ్రమైన అంశంపై మౌనం వహిస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలు, భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని, ఇలాంటి అక్రమాలను సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం (ఈసీ) పై ఉందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘంపై ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదని డిమాండ్ చేశారు.
పాతబస్తీలో బీఎల్ఓలపై బెదిరింపులు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులే ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు తమ సొంత సిబ్బందిపై నమ్మకం లేకనే ఈ ప్రక్రియపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. పాతబస్తీలో మజ్లిస్ నేతల తీరును తప్పుబడుతూ.. మీరు ఇళ్లకు వచ్చి సర్వే చేయవద్దు, మేమే పూరించిన ఫారాలను మీకు అందిస్తాం, ఓట్లను మాత్రం తొలగించకూడదు అంటూ గత నాలుగు నెలలుగా బీఎల్ఓలను ఏఐఎంఐఎం భయభ్రాంతులకు గురిచేస్తోందని, దీనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ మజ్లిస్ ఇష్టానుసారంగా సాగడానికి వీల్లేదని, ఎంఐఎం బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఉద్యోగులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
'రేవంత్ ఉద్దీన్' అంటూ ఎద్దేవా
ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం దయాదాక్షిణ్యాల కోసం ప్రాకులాడుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ‘కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్’ అని అనడమే కాకుండా, తనను తాను ‘రేవంత్ ఉద్దీన్’ అని అభివర్ణించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలను ఓడించేందుకే ఎస్‌ఐఆర్ ఉపయోగపడిందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని.. మరి కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో జరిగిన ఎస్‌ఐఆర్ లపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘంపై ప్రజల్లో అనవసర అనుమానాలు రేకెత్తించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు
అంతకుముందు జూన్ 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్ ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన నిజమైన ఓటర్ల పేర్లు తొలగించబడుతున్నాయనే నివేదికల నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పార్టీ ఆదేశాలను పాటించని కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించిన సంగతి తెలిసిందే.
