
హైదరాబాద్ మెట్రో నిధులు, అనుమతులపై కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణతో పాటు, మెట్రో ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక అడుగు వేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, అనుమతుల విషయమై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి సీఎం బహిరంగ లేఖ రాశారు. ఈ అంశాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లి, ఒప్పంద నిబంధనల మేరకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ) నుంచి మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయించాలని కోరారు.
మెట్రో స్వాధీన ఆర్థిక ఒప్పందాల ప్రకారం, ఐఆర్‌ఎఫ్‌సీ అంగీకరించిన తొలి విడత రుణాన్ని 2026 జూన్ 15వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు షరతులన్నింటినీ పూర్తి చేయడమే కాకుండా, ఐఆర్‌ఎఫ్‌సీ కోరిన విధంగా ముందస్తు రుసుము కింద రూ.84.32 కోట్లను కూడా చెల్లించింది. అయినప్పటికీ ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని సీఎం లేఖలో వివరించారు.
మెట్రో స్వాధీన ప్రక్రియ, సంతకాలు చేసిన ఒప్పందాలు లేదా ప్రతిపాదిత ఫేజ్-2 విస్తరణకు సంబంధించి కేంద్రానికి ఇంకా ఏవైనా సందేహాలు లేదా అదనపు సమాచారం కావాలన్నా.. అధికారులతో కలిసి వ్యక్తిగతంగా వివరణలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో వీలైనంత త్వరగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డిని కోరారు. తానే స్వయంగా అవసరమైన ఆధార పత్రాలతో ఆ సమావేశానికి హాజరై, సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించుకోవడానికి సహకరిస్తానన్నారు.
రూ.38,595 కోట్లతో మెట్రో ఫేజ్-2 విస్తరణ
హైదరాబాద్ నగర ప్రయాణ అవసరాలను తీర్చేందుకు ప్రతిపాదించిన మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణ వివరాలను సీఎం లేఖలో పొందుపరిచారు. ఈ ఫేజ్-2 లో భాగంగా నగరంలో మొత్తం ఏడు కారిడార్లను కవర్ చేస్తూ, దాదాపు రూ. 38,595 కోట్ల భారీ అంచనా వ్యయంతో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లను విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల కేంద్ర అనుమతులను కూడా వీలైనంత త్వరగా మంజూరు చేయించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూల సమాచారం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
