Let's talk: editor@tmv.in
మైనారిటీల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళిక

మైనారిటీల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళిక

Gaddamidi Naveen
9 మే, 2026

రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మైనారిటీ యువత కేవలం సంప్రదాయ కోర్సులకు పరిమితం కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రణాళికలు రూపొందించారు.

ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వీటిలో కేవలం సాధారణ చదువులే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నైపుణాభివృద్ధి శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మాదిరిగానే ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేలా ఒక సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించాలని అధికారులను కోరారు.

గ్రూప్-1, 2, 3 పరీక్షల్లో ఎంపికైన మైనారిటీ అభ్యర్థులకు ఆసక్తి ఉంటే వారిని మైనారిటీ సంక్షేమ శాఖలోనే నియమించి, శాఖ కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. అలాగే, ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ పారితోషికాలను ఎలాంటి జాప్యం లేకుండా క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఖబరస్తాన్‌ల కోసం భూ లభ్యత ఉన్న చోట స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఒక వినూత్న ప్రతిపాదనను తెచ్చారు.డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఇంజిన్లతో రీట్రోఫిట్టింగ్ చేసి ఆటోడ్రైవర్ల ఇంధన వ్యయాన్ని తగ్గిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా గుడి, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆయా మతాల సంస్కృతులు, భారతదేశ విశిష్టత, తెలంగాణలోని గంగా-జమునా తెహ్జీబ్‌ను ప్రతిబింబించేలా ఈ కట్టడాలు ఉండాలని పేర్కొన్నారు. ఇవి భవిష్యత్తులో మన సంస్కృతులను అధ్యయనం చేసే ముఖ్య కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి అజారుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, టీజీఎంఆర్ఈఐఎస్ ప్రతినిధులు, వివిధ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.