Let's talk: editor@tmv.in
హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ‘హిట్లర్’ వ్యాఖ్యలు.. రాజకీయ దుమారం

హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ‘హిట్లర్’ వ్యాఖ్యలు.. రాజకీయ దుమారం

Gaddamidi Naveen
8 జూన్, 2026

హైడ్రాకు ఆ పేరు పెట్టడం వెనుక నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తనకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

శనివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో చెరువులు, కాలువలు, జలవనరుల విస్తృత ఆక్రమణలను గమనించిన తర్వాతే తాను ‘హైడ్రా’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పేదలు చెరువులు, నాలాలను ఆక్రమణలకు పాల్పడటం అర్థం చేసుకోవచ్చని, అయితే. ఈ రోజుల్లో ధనికులు తమ ఫార్మ్‌హౌస్‌ల కోసం జలవనరులను ఆక్రమిస్తున్నారు, వాటి డ్రైనేజీలను జలవనరుల్లోకి మళ్లించడం వంటి చర్యలతో చెరువులను ఆక్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నేను ఈ సమస్యలన్నింటినీ గమనించాను. ఆ తర్వాతే 'హైడ్రా' అనే ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాను అని సీఎం పేర్కొన్నారు.

హిట్లర్ స్ఫూర్తితోనే ‘హైడ్రా’ పేరు

సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. హైడ్రా అనేది హిట్లర్‌కు ఇష్టమైన పదం. ఎవరినైనా హతమార్చగల అతని ప్రధాన బృందాన్ని హైడ్రా అని పిలిచేవారు. అందుకే నేను హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ సంస్థకు హైడ్రా అని పేరు పెట్టాను అని వ్యాఖ్యానించారు. ఈ సంస్థను ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించి ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కాగా, నిజానికి 'హైడ్రా' అనేది మార్వెల్ కామిక్స్‌లోని ఒక కల్పిత సంస్థ. ఇది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల యొక్క లోతైన సైన్స్ విభాగంగా పనిచేసినట్లు చూపబడింది.

బీజేపీ, బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం

తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) లో తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రమాదకరమైన హిట్లర్ భావజాలాన్ని మరోసారి బహిర్గతమైందని ఆయన విమర్శించారు. హైడ్రాను ఏర్పాటు చేయడానికి హిట్లర్ తనకు స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి ఇప్పుడు బహిరంగంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కూల్చివేతలను యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో పోలుస్తూ, తన నాయకుడు రాహుల్ గాంధీ భాషనే మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎమర్జెన్సీ నుంచి హిట్లర్ వరకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజలను అణచివేస్తూనే ఉందని ఆరోపించిన ఆయన, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) లో తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది ప్రాణాలు తీసిన నియంత హిట్లర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదర్శంగా చెప్పుకోవడం సిగ్గుచేటని, మొన్న ప్రజా పాలన, నిన్న ఇందిరమ్మ పాలన అన్న రేవంత్, నేడు తనది "హిట్లర్ పాలన" అని ఒప్పుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గత రెండున్నరేళ్ల పాలనలో హైడ్రా, మూసీ, లగచర్ల, వెలుగుమట్ల వంటి ఘటనల్లో ప్రభుత్వ చర్యలు నాజీ పాలనను తలపించాయని ఆరోపించారు. తెలంగాణను సంక్షోభాల్లోకి నెట్టిన రేవంత్ పాలన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. “హిట్లర్ హటావో.. తెలంగాణ బచావో” అంటూ ప్రజలు మరో విముక్తి పోరాటానికి సిద్ధమవుతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్స్ లో స్పందిస్తూ రేవంత్ రెడ్డిని “కొత్త హిట్లర్” అని అభివర్ణించింది. ఈ సంస్థ ద్వారా లక్షలాది మంది పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించింది.

రాష్ట్రంలో చెరువులు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణలు, ఇతర అక్రమ కార్యకలాపాల నుంచి రక్షించడానికి తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వం జూలై 2024 లో ఈ హైడ్రా సంస్థను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ సంస్థ ఆక్రమణల తొలగింపు పనులను చేపడుతూ, పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది.