Let's talk: editor@tmv.in
సర్ ప్రక్రియ​పై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

సర్ ప్రక్రియ​పై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

Gaddamidi Naveen
25 జూన్, 2026

రాష్ట్రంలో జరుగుతున్న ‘ప్రత్యేక ఓటర్ల జాబితా స‌మ‌గ్ర‌ సవరణ’ (స‌ర్) కార్యక్రమంలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం స‌ర్ ప్రచారంపై పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించే నాయకులపై కఠిన చర్యలు ఉంటాయని, ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స‌ర్ అంశం చాలా సీరియస్ వ్యవహారమని, కొందరు నాయకులు దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. నాయకుల నిష్క్రియాపరత్వం వల్ల పార్టీ నష్టపోతే తాను ఊరికే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జుల పనితీరును తాము వచ్చే 10 రోజుల పాటు నిశితంగా గమనిస్తామని, పార్టీ ఆదేశాలను పాటించని వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని సీఎం డెడ్‌లైన్ విధించారు. జిల్లాల వారీగా జరిగిన అవగాహన సదస్సులపై ఇప్పటికే నివేదికలు వచ్చాయని, ఇన్‌చార్జ్ మంత్రులు మరింత బాధ్యత తీసుకుని ఈ ప్రచారాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ అనుబంధ సర్పంచులు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఓటర్ల సవరణ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం పిలుపునిచ్చారు.

పేద ప్రజల ఓటు హక్కును రక్షించడం అత్యంత ముఖ్యం. ఓటరు జాబితాలో పేరు కోల్పోతే, భవిష్యత్తులో అది ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అధికారిక పత్రాల లబ్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఒక్క నిజమైన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించబడకుండా క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలని సీఎం పార్టీ శ్రేణులను ఆదేశించారు.

ట్యాగ్‌లు
TelanganaRevanthReddyTelanganaCMVoterListSIRCampaignSpecialIntensiveRevisionElectionCommissionVoterRightsDemocracy
సర్ ప్రక్రియ​పై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక - Tholi Paluku