
జూన్ 17న నల్లగొండలో సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.13 వేల కోట్ల పనులకు శంకుస్థాపన
తెలంగాణ రోడ్ నెట్‌వర్క్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో ‘హ్యామ్’ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానంలో చేపట్టబోయే రూ. 13,000 కోట్ల విలువైన చారిత్రాత్మక రోడ్డు విస్తరణ పనులకు ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కనగల్‌లో తెలంగాణలోనే గత రెండున్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన ‘హ్యామ్’ నమూనాలోనే, తెలంగాణలోని 6,300 కిలోమీటర్ల రహదారులను 34 ప్యాకేజీల్లో డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయడానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, వర్క్ ఆర్డర్లు కూడా జారీ చేశామని మంత్రి తెలిపారు. దీనికి అదనంగా మంత్రి సీతక్క ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ శాఖ ద్వారా మరో రూ. 7,000 కోట్ల అభివృద్ధి పనులు కూడా త్వరలోనే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
జూన్ 17న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కనగల్ ప్రాంతంలో పనులకు శ్రీకారం చుడతారు. అంతకుముందు దర్వేష్‌పురం ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దర్వేష్‌పురం నుంచి గుర్రంపోడు, మల్లెపల్లి, దేవరకొండ మీదుగా దిండి వరకు సుమారు రూ. 300 కోట్లతో డివైడర్‌తో కూడిన డబుల్ రోడ్డు నిర్మిస్తారు.అలాగే చిట్యాల నుంచి రామన్నపేట, వలిగొండ, భువనగిరి మీదుగా జగదేవ్‌పూర్ వరకు సుమారు రూ. 300 కోట్లతో డబుల్ రోడ్డు పనులు చేపడతారు. అలాగే ఆలేరు నియోజకవర్గంలోనూ రూ. 300 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతాయని మంత్రి తెలిపారు.
వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ఆమోదం
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు 24 గంటల పాటు నిరంతరాయంగా కృష్ణా జలాలను అందించేందుకు ప్రభుత్వం రూ. 125 కోట్లతో కొత్త వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. దీనికి కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రోజునే వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ భారీ రోడ్డు విస్తరణ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ముఖచిత్రం మారడమే కాకుండా, ప్రమాదాలు తగ్గి గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు, పెట్టుబడులు భారీగా వస్తాయన్నారు. సభ విజయవంతానికి ఈ నెల 13న ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపిన మంత్రి.. నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
