Let's talk: editor@tmv.in
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Gaddamidi Naveen
1 జులై, 2026

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలు, సంస్థలకు భూముల కేటాయింపునకు సంబంధించి స్పష్టమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా, ఎవరికి భూములు కేటాయించినప్పటికీ వాటి భూ యాజమాన్యపు హక్కులు పూర్తిగా దేవస్థానం పరిధిలోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని బోధి పెవిలియన్‌లో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్టలో భూముల కేటాయింపుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న నిబంధనలను కూలంకషంగా అధ్యయనం చేయాలని సీఎం చెప్పారు. అలాగే, ఇక్కడ ‘హరే రామ హరే కృష్ణ’ (చారిటబుల్) ఫౌండేషన్‌కు మార్కెట్ ధర ప్రకారమే భూమిని కేటాయించాలని సూచించారు. కొండపైన కాటేజీలు, అతిథి గృహాల నిర్మాణం కోసం ముందుకు వచ్చే దాతల జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఇందులోనూ టీటీడీ తరహా విధానాన్నే అమలు చేస్తూ, దశలవారీగా అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. కుల సంఘాలకు స్థలాల కేటాయింపుపైనా పక్కా నిబంధనలతో కూడిన పాలసీని తేవాలన్నారు.

ఆలయ పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూసేకరణకు తక్షణమే నిధులను మంజూరు చేయాలని సీఎం ఆర్థిక శాఖను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ల కమిటీ సమర్పించిన నివేదికను సమగ్రంగా పరిశీలించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. వీటితో పాటు, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు కిరణ్ కుమార్ చామల, రఘువీర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు దేవాదాయ, ఆర్థిక, లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
YadagiriguttaYadadriLakshmiNarasimhaSwamyTelanganaRevanthReddyTempleDevelopmentTTDDevadayaSakhaSpiritualTourismTempleNews