
ప్రజాస్వామ్య విజయం.. 'నల్ల చట్టాల' ఓటమిపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు 2029 నుంచి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పందించారు. భారత రాజకీయ చరిత్రలో ఏప్రిల్ 17 ఒక చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు.
ఈ "నల్ల చట్టాలను" అడ్డుకోవడానికి ఏకతాటిపైకి వచ్చిన ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి 'ఎక్స్' వేదికగా .. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై ఒక జాతీయ విపత్తును తప్పించాయని ఆయన పేర్కొన్నారు. ఈ పోరాటంలో అండగా నిలిచిన ఎం.కె. స్టాలిన్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ వంటి నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దీనిపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. దీంతో మూడింట రెండొంతుల (352 ఓట్లు) మెజారిటీని ఎన్డీఏ సాధించలేకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న పునర్విభజన ప్రయత్నాలను అడ్డుకోవడం దేశ సమాఖ్య స్ఫూర్తికి విజయమని ముఖ్యమంత్రి కొనియాడారు.
