Let's talk: editor@tmv.in
తెలంగాణ విద్యుత్ రంగ బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలంగాణ విద్యుత్ రంగ బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Gaddamidi Naveen
3 మే, 2026

రాష్ట్రంలో నూత‌న‌ పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి భారీ అభివృద్ధి ప్రాజెక్టులు అమల్లోకి రానున్న నేపథ్యంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

విద్యుత్ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ వేం. నరేందర్ రెడ్డితో పాటు ఇంధన శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, డేటా సెంటర్లు, మౌలిక వసతుల విస్తరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ముందుగానే బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలులో భాగంగా ప్రాధాన్య క్రమంలో దరఖాస్తులు సమర్పించిన వారికి అనుమతుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఆలస్యం కాకుండా త్వరితగతిన ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలంటే విద్యుత్ లభ్యతతో పాటు అనుమతుల వ్యవస్థ కూడా సమర్థవంతంగా ఉండాలని పేర్కొన్నారు.

సౌర విద్యుత్ వినియోగాన్ని గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. అలాగే సోలార్ స్టౌల వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచాలని చెప్పారు. విద్యుత్ సబ్‌స్టేషన్లకు అనుబంధంగా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే దిశగా ప్రయోగాత్మక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాల వారీగా రెండు సబ్‌స్టేషన్ల పక్కన సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో జిల్లాకు రెండు చొప్పున మొత్తం 18 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు.

అదే సమయంలో విద్యుత్ సరఫరాలో లోపాలను గుర్తించడం, వినియోగ అంచనాలను మెరుగుపరచడం, సేవల సామర్థ్యాన్ని పెంచడం కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతికతను వినియోగించాలని సీఎం పేర్కొన్నారు. అలాగే తెలంగాణ‌ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో చేరికపై ఉద్యోగులు, సిబ్బందిలో ఉన్న అపోహలను తొలగించాలని అధికారులను సీఎం ఆదేశించారు.