Let's talk: editor@tmv.in
రాష్ట్రంలో తీవ్ర వడగాలులపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

రాష్ట్రంలో తీవ్ర వడగాలులపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Gaddamidi Naveen
21 మే, 2026

రాష్ట్రంలో తీవ్ర వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున, ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికార యంత్రాంగం తక్షణమే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

వడదెబ్బ వంటి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని సీఎం సూచించారు. ఆసుపత్రుల్లో వడదెబ్బకు గురైన రోగులకు తక్షణ చికిత్స అందించేందుకు అవసరమైన మందులు, సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయట ప్రయాణాలు చేయకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ జిల్లాల వారీగా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ను సీఎం ఆదేశించారు. వడగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం గణాంకాల ప్రకారం.. జగిత్యాల జిల్లాలోని ఐలాపూర్‌లో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీని తర్వాత నల్గొండ జిల్లాలోని కట్టంగూర్, నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్‌లలో 45.8 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర పలు ప్రాంతాల్లో కూడా ఎండలు మండిపోతుండటంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం కీలక ముందస్తు అంచనాను విడుదల చేసింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.