
వర్షాలపై ముందస్తు చర్యలు.. అధికార యంత్రాంగానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని అన్ని శాఖలు అత్యంత హై అలర్ట్‌లో ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాబోయే రోజుల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ పరిపాలన విభాగం, హైడ్రా, విద్యుత్ పంపిణీ సంస్థలు, జలమండలితో పాటు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగరంలో వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా నీరు నిలిచే ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైన చోట తక్షణ సహాయక బృందాలను మోహరించి పరిస్థితిని నియంత్రణలో ఉంచాలని చెప్పారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోర్ అర్బన్ రీజియన్ ప్రత్యేక కార్యదర్శి సహా సీనియర్ అధికారులతో కలిసి పరిస్థితిని యుద్ధ ప్రాతిపదికన సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైన చర్యలను వేగంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. వర్షాల సమయంలో నగరంలో సాధారణ జీవనానికి అంతరాయం కలగకుండా అత్యవసర సేవలు నిరంతరాయంగా కొనసాగాలని సీఎం సూచించారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
