
కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. మెట్రో ఫేజ్-2పై చర్చ
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 విలువ నిర్ధారణతో పాటు ఫేజ్-2 ప్రాజెక్టు విస్తరణకు సంబంధించిన సమగ్ర అధ్యయనం కోసం ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (ఎస్‌బీఐ క్యాప్స్)ను కన్సల్టెంట్‌గా నియమించాలని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లతో వరుసగా రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు.
మొదట సోమవారం రాత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, జీ. కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం మంగళవారం ఉదయం ఈ సమావేశాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో డిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంయుక్తంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఎదురవుతున్న సవాళ్లు, అలాగే ఫేజ్-2 ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం రెండు ప్రభుత్వాలు ఒకే అభిప్రాయానికి వచ్చి కన్సల్టెంట్‌ను నియమించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
కన్సల్టెంట్‌గా ఎంపికైన ఎస్‌బీఐ క్యాప్స్ మెట్రో రైలు ఫేజ్-1 ఆస్తుల విలువను అంచనా వేయడంతో పాటు స్వాధీనం కోసం అవసరమైన రుణాల సమీకరణ, రుణాలు అందించే సంస్థల ఎంపిక వంటి అంశాలపై అధ్యయనం చేయనుంది. అదేవిధంగా మెట్రో ఫేజ్-2 విస్తరణ, నిర్మాణ వ్యయం, ఆర్థిక వనరుల సమీకరణ తదితర అంశాలపై కూడా సమగ్ర నివేదిక సిద్ధం చేయనుంది.
ఎస్‌బీఐ క్యాప్స్ సమర్పించే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నాయి. అధ్యయనం వేగంగా పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అధికారి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సమన్వయ అధికారులుగా నియమించేందుకు కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ అధికారులు పరస్పర సమన్వయంతో అధ్యయన ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
