Let's talk: editor@tmv.in
గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Gaddamidi Naveen
20 ఏప్రిల్, 2026

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. అధికారికంగా ఇది మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నప్పటికీ, మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ నామినేషన్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

పెండింగ్‌లో ఉన్న ఇద్దరు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని కోరారు. గత ఏడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్దీన్, నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపు (ఏప్రిల్ 30వ తేదీలోగా) శాసనమండలి లేదా శాసనసభకు ఎన్నికవ్వాల్సి ఉంది. గడువు సమీపిస్తున్నా ఆయన నామినేషన్‌కు ఇంకా క్లియరెన్స్ రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అజారుద్దీన్‌తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ నామినేషన్ల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. దీనికి ముందు రోజే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గవర్నర్‌ను కలిసి న్యాయపరమైన అంశాలపై చర్చించడం గమనార్హం.

విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ సూచించారు. జూన్ 12న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న అవగాహన సదస్సుపై కూడా చర్చించారు. గవర్నర్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అజారుద్దీన్ మంత్రి పదవిని కాపాడుకోవాలంటే మరో పది రోజుల్లోగా గవర్నర్ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. ఒకవేళ ఏప్రిల్ 30 లోగా నామినేషన్ ఖరారు కాకపోతే సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి అడుగులు ఎలా వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.