
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక ప్రాజెక్టులపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయం 'కర్తవ్య భవన్' లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని కీలక మౌలిక సదుపాయాలు, రక్షణ రంగానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల పురోగతిపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అవసరమైన రక్షణ శాఖ భూములను బదలాయించినందుకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు విజ్ఞప్తి
రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒకటైన ఆదిలాబాద్ విమానాశ్రయ విస్తరణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ సాగింది. భారత వాయు సేన (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ఎయిర్‌పోర్ట్ దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశం కావడం వల్ల, దీనిని భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, యుటిలిటీల బదలాయింపు ప్రక్రియలో పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వాయుసేన రన్ వేతో పాటు పౌర విమానయాన ప్రయాణికుల కోసం ప్రత్యేక టెర్మినల్ బిల్డింగ్, కార్గో సర్వీసులు, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాల్ సేవలు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్ సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇటీవల మధ్య ఆసియాలో చోటుచేసుకున్న భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ తమ హ్యాంగర్ల ఏర్పాటుకు సురక్షితమైన ప్రదేశాలను అన్వేషిస్తున్నాయి. గ్లోబల్ ఎయిర్‌లైన్స్ హ్యాంగర్ల ఏర్పాటుకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అత్యంత అనుకూలమైన ప్రాంతం అని సీఎం సూచించారు.
దేవరకద్ర డీఆర్డీవో ప్రాజెక్టుపై విజ్ఞప్తి
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో ఒక కీలకమైన ప్రాజెక్టు ఏర్పాటుకు డీఆర్డీవో / డీఆర్డీఎల్ సంస్థలు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకున్నట్లు సీఎం గుర్తుచేశారు. రక్షణ రంగానికి ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ఈ రక్షణ ప్రాజెక్టులు వేగవంతం కావడం వల్ల తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
