Let's talk: editor@tmv.in
8 వేల ‘ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు’ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
8 వేల ‘ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు’ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
8 వేల ‘ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు’ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

8 వేల ‘ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు’ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

Gaddamidi Naveen
26 మే, 2026

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు చారిత్రాత్మక నిర్ణయాలను ప్రకటించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల కోసం నిర్మించనున్న 8,000 ‘ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు’ ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

ఈ ఉన్నత స్థాయి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదే వేదికపై మహిళలకు అందించే ‘ఇందిరమ్మ చీరల’ సరికొత్త డిజైన్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు.

నియోజకవర్గాల్లో కార్పోరేట్ తరహా ‘మహిళా శక్తి సూపర్ బజార్లు’

మహిళలు వ్యాపార రంగంలో రాణించేందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ కార్పొరేట్ స్థాయిలో "ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లను" ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మొదటి విడతగా 119 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి, మహిళా సంఘాలకు కేవలం నామినల్ అద్దె ప్రాతిపదికన 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని మంత్రి పొంగులేటికి సూచించారు. ఈ సూపర్ బజార్ల ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున కార్పస్ ఫండ్ ఇస్తామని, కార్పొరేట్ చైన్ సూపర్ బజార్ల కంటే నాణ్యమైన వస్తువులను అందిస్తూ దేశంలోనే ఇవి బెస్ట్ బ్రాండ్‌గా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు.

మండలానికి రైస్ మిల్లులు, గోడౌన్లు

ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న కొంతమంది మిల్లర్లు, దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ఇకపై స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు, లాజిస్టిక్ సెంటర్లు, గోడౌన్లను నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతి మండలంలో 2 నుంచి 4 స్థలాలను గుర్తించి పెద్ద గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. వీటికి అవసరమైన రుణాలను జీరో వడ్డీతో బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పించే పూచీ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయన్నారు. భవిష్యత్తులో మహిళల దగ్గరి నుంచే మిల్లర్లు ధాన్యం తీసుకెళ్లేలా వ్యవస్థను మారుస్తామన్నారు.

మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల లింకేజీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. కాగా, రుణాలపై జీరో వడ్డీ కింద ప్రభుత్వం ఇప్పటికే రూ. 1,390 కోట్లు చెల్లించిందని, వంద శాతం రికవరీ సాధించిన నిర్మల్ జిల్లా మహిళలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మహిళా సంఘాలకు 1,000 ఆర్టీసీ బస్సులను కేటాయించి, అద్దె రూపేణా నెలకు రూ. 70,000 ఆదాయం వచ్చేలా ప్రణాళిక వేశామన్నారు. అందులో భాగంగా జూన్ 5న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి మరో 553 బస్సులను అందించబోతున్నట్లు వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినందుకు గానూ గత 29 నెలల్లో ఆర్టీసీకి రూ. 10 వేల కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. మహిళలు సొంతంగా వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికి వీలుగా మే 29న ‘వీ-హబ్’ ద్వారా ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

2034 నాటికి కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న వివిధ జిల్లాల మహిళలతో మాట్లాడిన సీఎం, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు తెచ్చే ‘పంటల మార్పిడి’పై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.