

శ్రీహరికోటకు విక్రమ్-1 రాకెట్.. ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
అంతరిక్ష పరిశోధనా రంగంలో తెలంగాణ మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1'ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ మామిడిపల్లిలోని జీఎంఆర్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఉన్న 'మాక్స్-క్యూ' డిజైన్ ఫెసిలిటీలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విక్రమ్-1 రాకెట్‌ను పూర్తిగా హైదరాబాద్‌లోనే రూపొందించి అభివృద్ధి చేయడం రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణమని కొనియాడారు. 2022లో తొలి రాకెట్‌ను ప్రయోగించిన స్కైరూట్, అతి తక్కువ కాలంలోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకోవడం అద్భుత విజయమని అభినందించారు. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో ఉందని, బోయింగ్, ఎయిర్‌బస్ వంటి అంతర్జాతీయ సంస్థలకు నిలయంగా మారిందని గుర్తుచేశారు. 2047 నాటికి తెలంగాణను ప్రపంచ ఏరోస్పేస్ హబ్‌గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఇంజనీరింగ్ ఎగుమతుల విషయంలో కూడా తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం 2023-24 నుంచి 2024-25 మధ్య రాష్ట్రం 117.9 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఇందులో విమాన విడిభాగాలు, రక్షణ పరికరాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను కూడా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చి, టాటా టెక్నాలజీస్ వంటి సంస్థల సహకారంతో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.
స్కైరూట్ భాగస్వామ్యం
ముఖ్యమంత్రి ప్రతిపాదనపై స్కైరూట్ సీఈఓ పవన్ కుమార్ చందన సానుకూలంగా స్పందించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను అధిగమించేందుకు వైఐఎస్‌యూతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని ప్రకటించారు. గతేడాది దావోస్ పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ సహకారం కొనసాగుతుందన్నారు.
విక్రమ్-1 ప్రత్యేకతలు
విక్రమ్-1 రాకెట్ అత్యంత తేలికైనది, దృఢమైనది. ఇది బహుళ ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. తాజాగా ఆవిష్కరించిన ఈ రాకెట్ ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకొని తదుపరి ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తరలించి ప్రయోగానికి సిద్ధం చేస్తారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, స్కైరూట్ సహ వ్యవస్థాపకులు భరత్ దాక, గ్రీన్‌కో వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ చలమలశెట్టి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ విజయం తెలంగాణను గ్లోబల్ ఏరోస్పేస్ మ్యాప్‌లో మరో మెట్టు పైకి ఎక్కించింది.
