Let's talk: editor@tmv.in
హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్ఆర్‌తో అంబులెన్స్‌లు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్ఆర్‌తో అంబులెన్స్‌లు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
1 జులై, 2026

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో చేపట్టిన పలు ప్రజా ఉపయోగకర అభివృద్ధి పనులను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ‌లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సమకూర్చిన రెండు అత్యాధునిక ఆంబులెన్స్‌లకు ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్యాంకు నిధులతో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ స్కానర్‌ను ఆయన వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నతాధికారులతో కీలక విషయాలను చర్చించారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి బ్యాంక్ రుణాల చెల్లింపులు అత్యంత సక్రమంగా, క్రమశిక్షణతో జరుగుతున్నాయని సీఎం కొనియాడారు. అందువల్ల మహిళా సంఘాలకు మరింత విరివిగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకు ప్రతినిధులను కోరారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక ఎదుగుదలే ధ్యేయంగా ప్రభుత్వం వారి ద్వారా రాష్ట్రంలో లాజిస్టిక్ పార్కులు, గోదాములు , రైస్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని సీఎం తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టుల నిర్వహణ కోసం మహిళా గ్రూపులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం, రుణాలు అందించాలని హెచ్‌డీఎఫ్‌సీ యాజమాన్యానికి సూచించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
CMRevanthReddyTelanganaHDFCBankCSRHealthcareAmbulanceMRIWomenEmpowermentSelfHelpGroupsSHGFinancialInclusionLogistics