Let's talk: editor@tmv.in
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

Gaddamidi Naveen
30 ఏప్రిల్, 2026

తెలంగాణలోని తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చ జరిగింది. ప్రాజెక్ట్ అమలు, నీటి వినియోగ సామర్థ్యం, మహారాష్ట్రతో సమన్వయం వంటి కీలక అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులతో పాటు నీటిపారుదల శాఖకు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు ఎంత ఉండాలి, దాని వల్ల ఎంత నీటిని వినియోగించుకోవచ్చన్న అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరణ ఇచ్చారు.

150 మీటర్ల ఎత్తున నిర్మాణం - నిపుణుల సూచన

నిపుణుల అంచనాల ప్రకారం, 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని సమావేశంలో వెల్లడైంది. ఇప్పటికే ప్రణాళికల్లో భాగంగా కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయని, సుమారు 71.5 కిలోమీటర్ల మేర కాలువ పనులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ పనులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలంటే ప్రతిపాదిత ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం అవసరమని సూచించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు. ఇప్పటికే చేపట్టిన పనులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ఉండాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్రతో జరిగిన గత చర్చల ప్రకారం 148 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణానికి ఆ రాష్ట్రం అంగీకరించిందని అధికారులు తెలిపారు. అయితే 152 మీటర్ల ఎత్తు వద్ద నిర్మిస్తే మహారాష్ట్ర ప్రాంతంలో ముంపు సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 150 మీటర్ల ఎత్తు ఒక మధ్యమార్గంగా ఉండి, తక్కువ ఖర్చుతో గరిష్ట ప్రయోజనం పొందవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ పూర్తయితే ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీటి సదుపాయం మెరుగవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో తరలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మహారాష్ట్రలో ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

రాజకీయ సమన్వయం - కేంద్రానికి లేఖ

మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్నందున, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒప్పించేలా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం ఆదేశించారు. అవసరమైతే నేడు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలిసి చర్చించాలని నిర్ణయించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల దృష్ట్యా మహారాష్ట్రను ఒప్పించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉందని సీఎం వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణలో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.