
నీట్ పేపర్ లీక్‌పై పారదర్శక విచారణ జరపాలి:సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తక్షణమే స్పందించి పారదర్శకంగా, ఒక నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు, ఆధునిక సాంకేతిక రక్షణలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అయోమయంలో 23 లక్షల మంది విద్యార్థులు
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ మే 3వ తేదీన దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని సీఎం గుర్తు చేశారు. పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దు కావడంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆయన కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అనిశ్చితిలో పడిందని వారి శ్రమకు విలువ లేకుండా పోయిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ తీరు ఒకటే: సీఎం విమర్శలు
ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ తీరుపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. వైఫల్యాలు, మోసాలు, వ్యవస్థీకృత అవినీతి విషయంలో ఈ రెండు పార్టీలు ఒకే బాటలో నడుస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని దుయ్యబట్టారు. జాతీయ స్థాయి పరీక్షల విశ్వసనీయతను కాపాడటం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
దోషులను కఠినంగా శిక్షించాలి
ఈ కుంభకోణంలో ఎవరి ప్రమేయం ఉన్నా వారు ఎంతటి శక్తివంతులైనా ఏ పదవిలో ఉన్నా సరే కఠినంగా శిక్షించాల్సిందే" అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్‌టీఏ తన సంస్థాగత బాధ్యతను బలోపేతం చేసుకోవాలని ఈ సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకొని పరీక్షా నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. వ్యవస్థలోని లోపాల కారణంగా నిర్దోషులైన విద్యార్థులు బలికాకూడదని ఆయన హితవు పలికారు.
అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. పోటీ పరీక్షలు అనేవి విద్యార్థుల ఉన్నత అవకాశాలకు మార్గం కావాలి కానీ, వారిని మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురిచేసేవిగా ఉండకూడదు విద్యార్థుల త్యాగాలు, వారి ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం వేగంగా నిజాలను వెలికితీయాలని ఆయన కోరారు.
