Let's talk: editor@tmv.in
అనకాపల్లిలో రూ.5,400 కోట్ల సోలార్‌ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన

అనకాపల్లిలో రూ.5,400 కోట్ల సోలార్‌ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన

Panthagani Anusha
24 ఏప్రిల్, 2026

రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల హబ్‌గా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో భారీ ముందడుగు వేసింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ' రెన్యూ సోలార్' తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఘనంగా శంకుస్థాపన చేశారు. 6 గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్, దేశీయ సౌర విద్యుత్ రంగంలోనే కాకుండా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది.

సోలార్ రంగంలో విప్లవం:

ఇన్‌గాట్-వేఫర్* *తయారీ

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యుత్ భద్రతే దేశాభివృద్ధికి ప్రాతిపదిక అని స్పష్టం చేశారు. "ఇన్నాళ్లూ సోలార్‌ ప్యానెళ్ల తయారీకి అవసరమైన ఇన్‌గాట్-వేఫర్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు అనకాపల్లి వేదికగా వాటిని ఇక్కడే తయారు చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా స్వదేశీ తయారీ రంగానికి ఊపిరి పోస్తున్నాం అని ఆయన వివరించారు. సుమంత్ సిన్హా నేతృత్వంలోని రీన్యూ సంస్థ కేవలం 24 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని దీని ద్వారా సుమారు 2,100 మంది యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రూ. 82,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం

రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగుతోందని, రీన్యూ సంస్థ మొత్తంగా రూ. 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం వెల్లడించారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో త్వరలోనే రూ. 10,370 కోట్ల విలువైన విండ్, సోలార్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 2030 నాటికి దేశం నిర్దేశించుకున్న 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో ఏపీ వాటా 160 గిగావాట్లుగా ఉండబోతోందని తద్వారా రాబోయే కాలంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు 7.5 లక్షల ఉద్యోగాల సృష్టి జరగబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రతి ఇల్లూ ఒక విద్యుత్ కేంద్రం

ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ కేవలం భారీ ప్లాంట్లు మాత్రమే కాకుండా సాధారణ పౌరులను సైతం భాగస్వామ్యం చేసేలా 'పీఎం సూర్య ఘర్' పథకం కింద 40 లక్షల ఇళ్లపై సౌర ప్యానెళ్లు అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీనివల్ల విద్యుత్ నష్టాలు తగ్గడమే కాకుండా వినియోగదారులకు ఆర్థిక ఊరట లభిస్తుందన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఆర్టీసీ బస్సులను విడతలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

పోలవరం, భోగాపురంపై క్లారిటీ

అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మౌలిక సదుపాయాల పనుల వేగాన్ని సీఎం గుర్తుచేశారు. వచ్చే ఏడాది (2026) వర్షాకాలం నాటికి సుజల శ్రావంతి ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి అందిస్తాం. అదేవిదంగా జూలై మొదటి వారంలో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల లోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన విద్యుత్ రంగాన్ని గాడిలో పెడుతూనే ప్రజలపై ఎలాంటి అదనపు విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.