Let's talk: editor@tmv.in
ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం.. రూ. 2,000 కోట్ల విడుదల

ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం.. రూ. 2,000 కోట్ల విడుదల

Gaddamidi Naveen
30 మే, 2026

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, చేతల్లో చూపిస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది.

ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలను కేవలం 100 రోజుల్లో రూ. 6,000 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ఉద్యోగ జేఏసీ నాయకులకు గతంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చే దిశగా, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం తొలి విడతగా రూ. 2,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వంద శాతం క్లియర్

తాజాగా విడుదల చేసిన రూ. 2,000 కోట్ల నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన కీలక బకాయిలు పూర్తిగా పరిష్కరించబడ్డాయి. ముఖ్యంగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) బకాయిలను 100 శాతం పూర్తిగా చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నీ పూర్తిగా క్లియర్ చేశారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు, సమన్వయంతో కూడిన కార్యాచరణతోనే ఈ నిర్ణయం సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. మిగిలిన రూ. 4,000 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న ఈ సానుకూల దృక్పథం, వేగవంతమైన నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.