

సీఎంది మిషన్ మోడ్ కాదు.. కమిషన్ మోడ్: మాజీ మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు సోమవారం సందర్శించారు. కల్లాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హరీష్‌రావు ఆరోపించారు. యూరియా సరఫరా, కరెంటు, రైతుబంధు అమలులో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లలో కూడా పూర్తిగా చేతులెత్తేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల వరి దిగుబడి వస్తుండగా, ప్రభుత్వం మొదట 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు 70 లక్షల టన్నులకే పరిమితం కావడం రైతులను దళారుల చేతిలోకి నెట్టడమేనని అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడంలో కూడా పూర్తిగా విఫలమైంది. నాడు కేసీఆర్ హయాంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా రైతులకు ఇంతటి కష్టం ఎన్నడూ రాలేదని ఆయన గుర్తుచేశారు.
మిల్లర్లు బస్తాకు 43 కిలోల ధాన్యం మాత్రమే తీసుకుంటామని రైతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, దీంతో ఎకరాకు సుమారు 150 కిలోల వరకు నష్టం జరుగుతోందని తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని మండిపడ్డారు. నంగనూరు, ఖానాపూర్, మిట్టపల్లి, రాఘవాపూర్ తదితర గ్రామాల రైతులు ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రోహిణి కార్తె వచ్చినా వడ్లు ఇంకా కల్లాల్లోనే ఉండిపోవడం దురదృష్టకరమని, వర్షాలకు తడిసి ధాన్యం పాడవుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు కల్లాల వద్దే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కూర్చుని 'మిషన్ మోడ్' అని పేపర్ టైగర్ లా డైలాగులు కొడుతున్నారని, కానీ ఇది మిషన్ మోడ్ కాదు.. ‘కమిషన్ మోడ్’ అని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. శనివారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో రైతుల కష్టాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. 45 రోజుల్లో రైతుబంధు ఇస్తానని చెప్పి 63 రోజులైనా ఇంకా పూర్తిస్థాయిలో ఇవ్వలేదని, దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేయకుండా రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆయన విమర్శించారు. రైతుబంధు హామీ ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని, మక్కలు, సన్‌ఫ్లవర్, జొన్నలు అమ్మిన రైతులకు చెల్లింపులు వెంటనే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు మూడు రోజుల్లో కొనుగోళ్ల వేగం పెంచి, లారీలు, గన్నీ బ్యాగులు అందించకపోతే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్‌ను దిగ్బంధం చేస్తామని హరీష్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
