

నిమ్స్‌లో 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయి.. సీఎం అభినందనలు
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్య రంగంలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించింది. ఒకే ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో, ఒకే సంస్థాగత కార్యక్రమం కింద ఏకంగా 2,000 కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంట్) శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన నిమ్స్ వైద్య బృందాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ అరుదైన ఘనతను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. నిమ్స్ ఆసుపత్రిలో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స 1989లో జరిగిందని, అప్పటి నుంచి నిరంతరాయంగా సేవలు అందిస్తూ ఇప్పుడు 2,000 మార్కును దాటడం గర్వకారణమన్నారు. ఆసుపత్రిలోని యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల అసాధారణ నిబద్ధత, సమన్వయం, సహాయక సిబ్బంది ఉమ్మడి కృషే ఈ విజయానికి కారణమని ఆయన కొనియాడారు. పేద వర్గాలకు అత్యాధునిక వైద్య సేవలను అందించడంలో నిరంతరం మద్దతు ఇస్తున్న ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నిమ్స్ వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఒకే ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసిందని. ఈ అద్భుతమైన మైలురాయిని సాధించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ఘనతతో కిడ్నీ మార్పిడులలో దక్షిణ భారతదేశంలోనే నిమ్స్ ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్‌కు చెందిన ఐకేడీఆర్‌సీ మొదటి స్థానంలో, లూధియానా క్రిస్టియన్ మెడికల్ కాలేజీ రెండో స్థానంలో ఉండగా.. నిమ్స్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుందని సీఎంఓ తెలిపింది. మొత్తం 2,000 మంది లబ్ధిదారులలో 1,900 మంది (95 శాతం మంది) రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సంపూర్ణ ఉచితంగా ఈ వైద్యం పొందడం విశేషం. కాగా, 2023 జనవరి నుంచి గడిచిన మూడు సంవత్సరాల నాలుగు నెలల స్వల్ప వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 500 కిడ్నీ మార్పిడిలు పూర్తి చేయడం నిమ్స్ వైద్యుల అంకితభావానికి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు.
95 శాతం మందికి ఉచితంగా వైద్యం
చివరి దశ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న పేద, మధ్యతరగతి రోగులకు నిమ్స్ ఒక సంజీవనిలా మారిందని డైరెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు కిడ్నీ మార్పిడి చేసుకున్న 2,000 మంది రోగులలో దాదాపు 95 శాతం మందికి ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా సంపూర్ణంగా, ఉచితంగా చికిత్స అందించారు. శస్త్రచికిత్స మాత్రమే కాకుండా, ఆపరేషన్ తర్వాత రోగులు జీవితాంతం వాడాల్సిన ఖరీదైన ‘ఇమ్యునోసప్రెసివ్’ మందులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందిస్తూ రోగుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది.
రోబోటిక్ టెక్నాలజీ విభాగంలోనూ నిమ్స్ రికార్డు సృష్టించింది. దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటి రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసిన ఘనత నిమ్స్‌కే దక్కుతుందని డాక్టర్ బీరప్ప గుర్తుచేశారు. అత్యంత సంక్లిష్టమైన పీడియాట్రిక్ (పిల్లల) ట్రాన్స్‌ప్లాంట్లు, మల్టిపుల్ రీనల్ వెసల్స్ సర్జరీలు, రిపీట్ (రెండవసారి) ట్రాన్స్‌ప్లాంట్లను ఇక్కడి యూరాలజీ బృందం విజయవంతంగా పూర్తి చేసింది.
వైద్య సేవలు మరింత విస్తరిస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
నిమ్స్ వైద్యులను అభినందించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రపంచ స్థాయి అత్యాధునిక వైద్యాన్ని అందించగల సామర్థ్యం తెలంగాణకు ఉందని ఈ విజయం మరోసారి నిరూపించిందన్నారు. పేదలకు ఉచితంగా ప్రాణరక్షక చికిత్సలు అందించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా అవయవ మార్పిడి సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగానే ఇటీవలే గాంధీ ఆసుపత్రిలో ఆరు మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఆధునిక మౌలిక వసతులతో కూడిన అత్యాధునిక 'ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్'ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిలో ఒక 'ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆర్గాన్ రిట్రీవల్ (అవయవాల సేకరణ) కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ వైద్య రంగంలో అవయవ మార్పిడి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
