
మత్స్యకారుల ఖాతాల్లోకి రూ.20 వేలు.. నేడు నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రతి కుటుంబానికి రూ.20 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ నిధులను నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు.
కాగా ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల సంరక్షణ, ప్రజనన దశను దృష్టిలో ఉంచుకుని 61 రోజుల పాటు వేట నిషేధం అమలులో ఉంటుంది. ఈ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ఈ పథకాన్ని కొనసాగిస్తోంది.
గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్ల సాయం అందించగా ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య 1.30 లక్షలకు పెరిగింది. దీంతో రెండేళ్లలో మొత్తం రూ.505 కోట్ల సాయాన్ని ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు అందించినట్టైంది. గత ప్రభుత్వంలో రూ.10 వేల సాయం మాత్రమే అందించగా ప్రస్తుత ప్రభుత్వం దానిని రెట్టింపు చేసి రూ.20 వేలుగా పెంచింది.
మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం సకాలంలో పరిహారం అందిస్తోంది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన 63 క్లెయిమ్‌లకు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 పెండింగ్ క్లెయిమ్‌లకు రూ.5.65 కోట్ల పరిహారం చెల్లించింది. అదేవిధంగా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేందుకు సీవీడ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
