
నేడు కర్నూలులో బంగారు గనిని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి ఆవిష్కృతం కానుంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రూ. 405 కోట్ల బంగారు గనుల తవ్వకం, ప్రాసెసింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (జూన్ 24) అధికారికంగా ప్రారంభించనున్నారు. దీనితో రాష్ట్రంలో వాణిజ్యపరమైన బంగారు ఉత్పత్తి అధికారికంగా ప్రారంభం కానుంది.
'జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్', 'డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్' సంస్థలు ఉమ్మడిగా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశాయి. ప్లాంట్ మొదటి విభాగాన్ని ప్రారంభించడంతో పాటు, ఈ ప్రాజెక్ట్ విస్తరణ పనుల్లో భాగంగా రెండో యూనిట్‌కు కూడా ముఖ్యమంత్రి నేడు శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గనుల ఉమ్మడి ఉత్పాదక సంస్థగా ఈ ప్రాజెక్టు గుర్తింపు పొందింది. ఇప్పటివరకు బంగారు గనులకు కర్ణాటకలోని 'కోలార్ గోల్డ్ ఫీల్డ్స్స (కేజీఎఫ్) ప్రసిద్ధి చెందగా, ఇకపై ఈ జొన్నగిరి ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలోని బంగారు గనులలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోనుంది.
ఈ భారీ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 1,500 ఎకరాల భూమిని కేటాయించింది. తొలి దశలో భాగంగా ప్రస్తుతం 600 ఎకరాలలో మైనింగ్ కార్యకలాపాలు, ప్రాసెసింగ్ ప్లాంట్లను ఇప్పటికే సిద్ధం చేశారు. మిగిలిన స్థలంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తదుపరి దశలో విస్తరణ పనులు చేపడతారు. ఈ ప్లాంట్ ద్వారా మొదటి ఏడాదిలోనే 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో ఏడాది నుంచి ఇది 900 కిలోలకు పెరగనుంది. ఆ తర్వాతి కాలంలో క్రమంగా ఏడాదికి రెండు టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసేలా సామర్థ్యాన్ని పెంచుతారు.
రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం
ఈ గని ద్వారా ఉత్పత్తి అయ్యే బంగారం మొత్తం విలువపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 శాతం ఆదాయం లభిస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. తొలి ఏడాది 400 కిలోల ఉత్పత్తిపై దాదాపు రూ. 57 కోట్ల ఆదాయం, రెండో ఏడాది 900 కిలోల ఉత్పత్తిపై సుమారు రూ. 144 కోట్ల ఆదాయం రాయల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 700 మందికి పైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్
అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.45 గంటలకు జొన్నగిరి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ మొదటి యూనిట్‌ను ప్రారంభించి, రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడనున్నారు.
