
ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. తక్షణ చర్యలకు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సరఫరా అంతరాయం కారణంగా పలు పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడిన నేపథ్యంలో పరిస్థితిని వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న ఇంధన పరిస్థితిపై సీఎం శనివారం రాత్రి ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సరఫరా, డిమాండ్ పరిస్థితులను వివరంగా పరిశీలించారు.
అధికారుల వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా సరఫరా సమస్యల కారణంగా సుమారు 421 బంకులు మూతపడ్డాయి. అయితే సరఫరా 10 శాతం మేర పెరిగినప్పటికీ ప్రజల్లో ఏర్పడిన పానిక్ బైయింగ్ కారణంగా ఇంధనానికి డిమాండ్ గణనీయంగా పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు.
సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకు సగటున 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతుండగా శనివారం ఒక్కరోజే 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు నమోదయ్యాయి. దీంతో పలు బంకుల వద్ద భారీ క్యూలు ఏర్పడి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా ఆక్వా రంగంలో డ్రమ్ముల ద్వారా పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేయడం కూడా సరఫరా వ్యవస్థపై అదనపు ఒత్తిడిని పెంచుతోందని అధికారులు పేర్కొన్నారు.
కాగా ఈ పరిస్థితిని నియంత్రించేందుకు జిల్లా కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంధన సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ప్రస్తుత పరిస్థితి తదుపరి ప్రణాళికలపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ “గత మూడు రోజులుగా డీజిల్ డిమాండ్ పెరిగింది. కానీ ఆయిల్ కంపెనీలు అన్ని బంకులకు సరైన సరఫరా చేయలేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది” అని పేర్కొన్నారు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆయిల్ కంపెనీలు, డీలర్ల మధ్య సమావేశం జరిగినప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడలేదని తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఆయిల్ కంపెనీలు లీటరుకు రూ.30–40 వరకు నష్టాలను ఎదుర్కొంటున్నాయని ఈ కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడిందని వివరించారు. అయితే ఆదివారం సరఫరా మెరుగుపడితే పరిస్థితి క్రమంగా సద్దుమణిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గృహ ఎల్‌పీజీ, పీఎన్‌జీ, సీఎన్‌జీ లకు 100 శాతం సరఫరా కొనసాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగినంతగా ఉన్నాయని ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. హోర్ముజ్ జలసంధి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు భయంతో అధికంగా ఇంధనం కొనుగోలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
