
లాటరైట్ వర్గీకరణ మార్పుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం చంద్రబాబు లేఖ
లాటరైట్ గనుల వర్గీకరణలో ఇటీవల చేసిన మార్పుల వల్ల తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ అల్యూమినియం కంటెంట్ ఉన్న లాటరైట్‌ను మైనర్ మినరల్‌గా కాకుండా బాక్సైట్‌గా వర్గీకరించాలని కేంద్రం ఇటీవలే నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల ప్రభావితమైన మైనింగ్ లీజు దరఖాస్తులను రక్షించడానికి కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు.
ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్ లీజుల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపారు. గతంలో మైనర్ మినరల్ కేటగిరీ కింద ప్రాసెస్ చేసిన 402 దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. వీటిలో 19 లెటర్ ఆఫ్ ఇంటెంట్ దరఖాస్తులు, 113 ప్రభుత్వ భూముల దరఖాస్తులు, 255 అటవీ భూముల దరఖాస్తులు, 15 పట్టా భూముల దరఖాస్తులు ఉన్నాయి. గత నిబంధనల ప్రకారం వందలాది మంది దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫీజులు, భూముల కొనుగోళ్లు, అటవీ అనుమతుల కోసం ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సీఎం గుర్తుచేశారు.
నేను కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. లాటరైట్ గనులకు సంబంధించి ఒక ‘సేవింగ్ క్లాజ్’ (మినహాయింపు నిబంధన) ను అందించండి. పాత నిబంధనల ప్రకారమే ఈ పెండింగ్ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి రెండు సంవత్సరాల సడలింపు కాలాన్ని అనుమతించండని చంద్రబాబునాయుడు కోరారు. గతంలో మైకా, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, బారైట్స్ వంటి ఖనిజాలను మైనర్ ఖనిజాల నుంచి మేజర్ ఖనిజాలుగా పునర్వర్గీకరించినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సేవింగ్ క్లాజ్‌ను అందించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు లాటరైట్‌కు కూడా అదే విధమైన ఉపశమనం కల్పించాలని కోరారు.
ఈ విధమైన సడలింపు ఇవ్వడం వల్ల వందలాది మంది దరఖాస్తుదారులకు ఆర్థిక నష్టాలు కలగకుండా నిరోధించవచ్చని, అలాగే వర్గీకరణ మార్పుల వల్ల వచ్చే చట్టపరమైన వివాదాలను నివారించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ఈ సేవింగ్ క్లాజ్‌ను అమలు చేయడం ద్వారా సిమెంట్, ఇనుప ఖనిజం, రోడ్డు నిర్మాణ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు ఎటువంటి అంతరాయం లేకుండా లభిస్తుందని, తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా సురక్షితంగా ఉంటాయని సీఎం స్పష్టం చేశారు.
