Let's talk: editor@tmv.in
రొయ్యల దాణా ధరల పెరుగుదలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

రొయ్యల దాణా ధరల పెరుగుదలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

Panthagani Anusha
18 మే, 2026

రొయ్యల దాణా ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా రైతులకు ఊరట కల్పించే చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇక ఈ విషయమై సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ అధ్యక్షతన శనివారం ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశీయంగా ముడిపదార్థాల కొరతను అధిగమించడానికి ఫిష్‌మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం సోయా దిగుమతులపై పరిమితులు సడలించడం వంటి అంశాలపై కేంద్రం దృష్టి సారించేలా ఒత్తిడి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ రాష్ట్రంలోని ఆక్వా పరిస్థితిపై సమగ్ర నివేదికను సమర్పించారు.

అయితే సీబా శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం, జనవరి నుండి మే 2026 మధ్య సోయా, ఫిష్‌మీల్, ఫిష్ ఆయిల్ వంటి ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరగడం వల్ల దాణా తయారీ వ్యయం కిలోకు రూ. 31.03 మేర పెరిగింది. దాణా తయారీదారులు మాట్లాడుతూ.. ముడిపదార్థాల ధరలు 20 శాతం పైగా పెరగడం వల్ల టన్నుకు రూ. 25 వేల అదనపు భారం పడుతోందని అందుకే ధరల పెంపు తప్పడం లేదని వెల్లడించారు.

అయితే రైతు ప్రతినిధులు ఈ పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తయారీదారులు సిండికేట్‌గా మారి తమపై భారం మోపుతున్నారని వేసవి పంట పూర్తయ్యే వరకు పాత ధరలనే కొనసాగించాలని అదేవిదంగా ఏపీఎస్‌ఏడీఏ గుర్తింపు ఉన్న ఫారాలకు యూనిట్‌కు రూ. 1.50 చొప్పున సబ్సిడీ విద్యుత్ ఇవ్వాలని కోరారు.

ఈ నేపథ్యంలో కోళ్ల దాణా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని ముడిపదార్థాల ధరల ఆధారంగా ప్రతి నెల రొయ్యల దాణా ధరలను సవరించే కొత్త వ్యవస్థను తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా దళారుల తప్పుడు ప్రచారాల నుండి రైతులను రక్షించేందుకు, ప్రతి 15 రోజులకు ఒకసారి రొయ్యల అధికారిక కొనుగోలు ధరలను ప్రకటించేలా చర్యలు చేపట్టనున్నారు.

రొయ్యల దాణా ధరల పెరుగుదలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ - Tholi Paluku