Let's talk: editor@tmv.in
పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం పెంచాలని కోరుతూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం పెంచాలని కోరుతూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

Panthagani Anusha
17 మే, 2026

చమురు దిగుమతులపై దేశ భారం తగ్గించే దిశగా పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమ శాతాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని 40 శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం, ఇప్పటికే ఈ అంశంపై కేంద్రానికి లేఖ కూడా పంపినట్లు తెలిపారు.

బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని భారత్‌లో కూడా ఇథనాల్ వినియోగాన్ని పెంచితే పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం భారీగా ఆదా అవుతుందని వివరించారు. ఇప్పటివరకు ఇథనాల్ మిశ్రమం కారణంగా దేశానికి రూ.1.1 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యిందని తెలిపారు. అదేవిదంగా సుమారు 500 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గినట్లు వెల్లడించారు.

అయితే ఇథనాల్ ఉత్పత్తి వల్ల చెరకు మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని కాగా ఇప్పటివరకు రైతులకు రూ.87,558 కోట్ల మేర ఆదాయం చేకూరిందని సీఎం పేర్కొన్నారు . ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద మొత్తంలో పండుతున్న మొక్కజొన్న పంటకు ఇథనాల్ మిశ్రమం పెంపు నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.

మొక్కజొన్న ఇథనాల్ తయారీలో కీలక ముడి వనరుగా ఉండటంతో ఇథనాల్ డిమాండ్ పెరిగితే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని సీఎం తెలిపారు. ప్రస్తుతం కేంద్రం క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2400 కనీస మద్దతు ధర నిర్ణయించినప్పటికీ మార్కెట్‌లో కొనుగోళ్లు ఆ స్థాయిలో జరగడం లేదని చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు రూ.1700 నుంచి రూ.1800 మధ్యకు పడిపోయిన పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు.

మొక్కజొన్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇథనాల్ మిశ్రమ శాతాన్ని త్వరితగతిన పెంచే నిర్ణయం తీసుకోవాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు.