Let's talk: editor@tmv.in
సింగపూర్ వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో అమరావతి విజన్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
సింగపూర్ వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో అమరావతి విజన్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
సింగపూర్ వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో అమరావతి విజన్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

సింగపూర్ వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో అమరావతి విజన్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
17 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో జరుగుతున్న ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’ లో పాల్గొని, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణ అద్భుత విజన్‌ను ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ఘనంగా ఆవిష్కరించారు. సమానత్వం, సుస్థిరత, అపారమైన అవకాశాలు, అత్యుత్తమ జీవన ప్రమాణాలే పునాదులుగా ప్రజాకేంద్రక నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

సమ్మిట్‌లో భాగంగా జరిగిన "కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్?" అనే అంశంపై నిర్వహించిన లీడర్‌షిప్ ప్లీనరీ-2 సెషన్‌లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక డిజిటల్ సామర్థ్యాలు, మానవ జీవిత నాణ్యతను పెంచేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

ప్రజలే మా ప్రథమ ప్రాధాన్యత: సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి మాట్లాడుతూ "మా ప్రభుత్వ విధానంలో ‘ప్రజలే ప్రథమ ప్రాధాన్యత’. అమరావతి నగరం అనేది కేవలం కాంక్రీట్ కట్టడం కాదు. ఇది సమానత్వం, ప్రకృతి, ఆర్థిక అవకాశాలు, ఆహ్లాదకరమైన జీవన విధానాల కలయికతో కూడిన వేదిక" అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సాంకేతికత ఆధారిత వృద్ధి పై తనకున్న నిబద్ధతను గుర్తుచేసుకుంటూ.. తాను 25 ఏళ్ల క్రితమే సమాచార సాంకేతికత (ఐటీ) గురించి మాట్లాడానని, ఆనాడు తీసుకున్న ముందస్తు నిర్ణయాల వల్లనే నేడు తెలుగు ప్రజలు తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగేందుకు దోహదపడిందని ఆయన వివరించారు. రాష్ట్ర విభజన అనేది ఏపీకి ఒక సరికొత్త ఆధునిక నగరాన్ని నిర్మించుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని, ఈ క్రమంలోనే అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా, అపార అవకాశాల ప్లాట్‌ఫారమ్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

కృష్ణా నది ఒడ్డున అమరావతి నగరం రూపుదిద్దుకుంటోందని, ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ వంతెనలు నగర మౌలిక సదుపాయాలలో కీలకమైన అంశాలుగా ఉంటాయని సీఎం వివరించారు. అమరావతిని 21 కిలోమీటర్ల మేర విస్తరించిన అద్భుతమైన వాటర్‌ఫ్రంట్ సిటీగా అభివృద్ధి చేస్తారు. నగరంలో స్పోర్ట్స్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, టూరిజం సిటీ, హెల్త్ సిటీ, మీడియా సిటీ వంటి ప్రత్యేక జోన్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ పిలుపును అందుకుని రైతులు స్వచ్ఛందంగా 35,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద అందజేశారని, అందులో కొంత భాగాన్ని అభివృద్ధి చేసి తిరిగి అభివృద్ధి చెందిన ప్లాట్ల రూపంలో వారికే అందజేస్తున్నామని తెలిపారు.

సైబరాబాద్ నగర అభివృద్ధితో అమరావతిని పోలుస్తూ.. సైబరాబాద్ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు ఎకరా భూమి విలువ కేవలం రూ.2 లక్షలు ఉండగా, అది నేడు రూ.200 కోట్లకు పైగా పెరిగిందని గుర్తుచేశారు. అభివృద్ధి అనేది సంపద సృష్టికి ఎలా దారితీస్తుందో చెప్పడానికి సైబరాబాదే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. అమరావతిని ‘నాలెడ్జ్ సిటీ’గా మారుస్తూ జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలను ఆకర్షిస్తున్నామని, క్వాంటం కంప్యూటింగ్ హబ్ సరికొత్త డిజిటల్ మౌలిక సదుపాయాలు ఈ నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. వినూత్న ఆలోచనలతో అమరావతిలో సృష్టించబడుతున్న అవకాశాలను ఉపయోగించుకోవాలని ప్రపంచ ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు.

ఏపీకి సెమీకండక్టర్ పెట్టుబడుల ఆహ్వానం

వరల్డ్ సిటీస్ సమ్మిట్‌కు ముందు సీఎం చంద్రబాబు సింగపూర్‌లో జరిగిన "సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ రౌండ్‌టేబుల్" సమావేశంలో ప్రసంగించారు. పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని గ్లోబల్ సెమీకండక్టర్ కంపెనీలను ఆయన కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల సులభతరం కోసం "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను పరిశీలించడానికి ఇది సరైన సమయం. రాబోయే 30 రోజుల్లో పారిశ్రామికవేత్తలు మా రాష్ట్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న అనుకూల విధానాలను అంచనా వేయాలని నేను ఆహ్వానిస్తున్నాను అని సీఎం పిలుపునిచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారతదేశం అత్యంత సురక్షితమైన దేశమని, ఏపీలో వేగవంతమైన అనుమతులు, పారదర్శక విధానాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాయలసీమ ప్రాంతంలో త్వరలోనే ఒక భారీ సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాయలసీమ ప్రాంతం రక్షణ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ, ఆటోమొబైల్ రంగానికి భారీ అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో సింగపూర్‌కు చెందిన పలు ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వీటిలో గ్లోబల్ ఫౌండ్రీస్, వన్ సిస్టమ్ టెక్నాలజీస్, టెక్‌సెండ్ ఫోటోమాస్క్ మరియు ఆక్వాతెక్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో పెట్టుబడులు, ఉమ్మడి భాగస్వామ్యాలపై విస్తృతంగా చర్చించారు.

సీబీఎన్@361 డిగ్రీస్ - పాలీమ్యాథ్‌’ పుస్తకావిష్కరణ

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా శైలి, ప్రజా పరిపాలనలో ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలపై విశ్లేషిస్తూ రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్ - పాలీమ్యాథ్‌’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. స్థానిక తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీఎం ఈ పుస్తకాన్ని అధికారికంగా విడుదల చేశారు.

పుస్తకం యొక్క మొదటి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, ఏపీ పురపాలక పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ, తెలుగు అసోసియేషన్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి అందజేశారు. ఈ పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ శాఖమూరి శ్రీనివాస ప్రసాద్ రచించగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ ఆంగ్లంలోకి అనువదించారు.

గడిచిన సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు తీసుకున్న పలు చారిత్రాత్మక నిర్ణయాలను, సుపరిపాలన అభివృద్ధిలో ఆయన పోషించిన దార్శనిక పాత్రను ఈ పుస్తకంలో రచయిత క్షుణ్ణంగా విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు చంద్రబాబు నాయుడుకి ఆధునిక సింగపూర్ నిర్మాతగా భావించే ‘లీ కువాన్ యూ’ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక స్మారక వెండి నాణేన్ని బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ పుస్తకాన్ని త్వరలోనే తెలుగు, హిందీ, ఇతర భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే గతంలో ప్రచురితమైన ‘చంద్రబాబు ఎక్స్.0’ పుస్తకం యొక్క డిజిటల్ వెర్షన్ ఇప్పటివరకు దాదాపు 8 మిలియన్ల (80 లక్షల) డౌన్‌లోడ్‌లను నమోదు చేసినట్లు వారు ఈ సందర్భంగా వెల్లడించారు.