
రేపటి నుంచి నాలుగు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి జూలై 5వ తేదీ వరకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఐదు రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించి పలు ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదలైంది.
పర్యటనలో మొదటి రోజైన జూలై 1న నెల్లూరు జిల్లా చిల్లాకూరు మండలంలో సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మక ‘పేదల సేవలో’ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని ‘శ్రీసిటీ’ కి చేరుకుంటారు. అక్కడ సుమారు రూ. 750 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న 'హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్' కు శంకుస్థాపన చేస్తారు. ఆ రోజు రాత్రికి ఆయన శ్రీసిటీలోనే బస చేయనున్నారు.
జూలై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవిక మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తిరుపతి నగరంలో నిర్వహించే స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) సామర్థ్య పెంపు వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యులు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతినిధులు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం రాత్రికి ఆయన తిరుపతిలోనే బస చేయనున్నారు.
జూలై 3న కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సున్నపురాళ్లపల్లెలో ప్రతిష్టాత్మక ‘రాయలసీమ స్టీల్ ప్లాంట్’ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రారంభిస్తారు. అనంతరం పర్యటన చివరి దశలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పంకు చేరుకుంటారు.
జూలై 3 నుంచి 5 వరకు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఐదు రోజుల జిల్లా పర్యటనను ముగించుకున్న అనంతరం జూలై 5న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి తిరిగి చేరుకుంటారని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
