
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎన్డీయే, నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు, రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంతో పాటు ‘నీతి ఆయోగ్’ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం, సీఎం చంద్రబాబు బుధవారం (జూన్ 10) ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి దేశ రాజధానికి తిరుగుపయనమవుతారు. అనంతరం మధ్యాహ్నం 3:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు ‘భారత్ మండపం’ లో జరిగే ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల కీలక సమావేశానికి హాజరవుతారు. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత హోదాలో ఆయన.. జాతీయ స్థాయి పరిపాలన, అభివృద్ధి వ్యూహాలు రాజకీయాంశాలపై ఇతర కూటమి నాయకులతో కలిసి చర్చించనున్నారు.
రెండో రోజు నీతి ఆయోగ్ సమావేశం
జూన్ 11న రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరిగే 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. కేంద్ర-రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించడం, జాతీయ అభివృద్ధి వ్యూహాల రూపకల్పనే లక్ష్యంగా సాగే ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో దేశ ప్రధానితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. ఈ సందర్భంగా చంద్రబాబు దేశాభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రాధాన్యతలను, విభజన హామీలను కౌన్సిల్ ముందు ఉంచే అవకాశం ఉంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి, జూన్ 11 రాత్రి 9:00 గంటల ప్రాంతంలో తిరిగి అమరావతికి చేరుకుంటారు.
