Let's talk: editor@tmv.in
తమిళనాడు ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

Panthagani Anusha
20 ఏప్రిల్, 2026

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం తుది దశకు చేరుకున్న వేళ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) తన ప్రచార అస్త్రాన్ని మరింత పదును పెట్టింది. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి (సోమవారం) నుంచి రెండు రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.

తొలిరోజు కోయంబత్తూరు, చెన్నై లో ప్రచారం

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు పర్యటన నేటి మధ్యాహ్నం కోయంబత్తూరులో నిర్వహించే భారీ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అనంతరం పారిశ్రామిక కేంద్రాలైన హోసూర్, తల్లి ప్రాంతాల్లో జరిగే ఎన్నికల ర్యాలీల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. రాత్రికి రాజధాని చెన్నై చేరుకోనున్న ముఖ్యమంత్రి అవడిలో ఏర్పాటు చేసిన భారీ రోడ్‌షోలో పాల్గొంటారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ఎన్డీఏ మద్దతుదారులతో ఆయన ముఖాముఖి సంభాషించి అభివృద్ధి దిశగా ఎన్డీఏకు మద్దతు తెలపాలని పిలుపునివ్వనున్నారు.

రెండో రోజు సత్తూర్‌లో సామాజిక నేతలతో భేటీ

పర్యటనలో భాగంగా మంగళవారం చంద్రబాబు మదురైను సందర్శిస్తారు. అక్కడి నుంచి సత్తూర్ చేరుకుని వివిధ వర్గాల సామాజిక నేతలతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం నిర్వహించే కీలక ప్రచార సభలో పాల్గొని, సాయంత్రానికి తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు పయనమవుతారు.

చంద్రబాబు పర్యటనలో ప్రధానంగా ‘అభివృద్ధి-సుపరిపాలన’ అంశాలే హైలైట్ కానున్నాయి. సాంకేతిక ఆధారిత పాలన, మౌలిక సదుపాయాల కల్పనలో తనకున్న అపార అనుభవాన్ని వివరిస్తూ.. తమిళనాడు సమగ్ర అభివృద్ధికి ఎన్డీఏ విజన్ ఎంత అవసరమో ఆయన ప్రజలకు వివరించనున్నారు. దేశవ్యాప్త అభివృద్ధి అజెండాను ప్రతిబింబించేలా సాగనున్న ఈ యాత్రతో తమిళనాట కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తక్కువ సమయంలోనే రోడ్‌షోలు, బహిరంగ సభలతో ఓటర్లను ప్రభావితం చేసేలా చంద్రబాబు తన ప్రచార వ్యూహాన్ని రూపొందించారు.