Let's talk: editor@tmv.in
నాబార్డు క్రెడిట్ ప్లాన్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

నాబార్డు క్రెడిట్ ప్లాన్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

Panthagani Anusha
6 మే, 2026

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రూ.5.11 లక్షల కోట్ల భారీ రుణ ప్రణాళికను ప్రకటించారు. గత ఏడాది రూ.4.24 లక్షల కోట్లుగా ఉన్న ప్రణాళికను ఈ ఏడాది సుమారు 20 శాతం పెంచి రూ.5,11,491 కోట్లకు చేర్చినట్లు తెలిపారు.

ప్రాధమిక రంగానికి ప్రధానంగా ప్రాధాన్యం ఇస్తూ సాగు రంగానికి మొత్తం రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో పంట రుణాలకు రూ.1.66 లక్షల కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.34,972 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.8,265 కోట్లు, ఫిషరీస్‌కు రూ.21,098 కోట్లు, హార్టికల్చర్‌కు రూ.11,961 కోట్లు కేటాయించారు. హార్టికల్చర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు కలిపి రూ.5,313 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.9,957 కోట్లు అనుబంధ కార్యకలాపాలకు రూ.12,687 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి రూ.1.64 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా పారిశ్రామిక వృద్ధికి ప్రోత్సాహం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయం ముఖ్యంగా హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. హార్టికల్చర్ ఉత్పత్తులను ఏడాదికి 450 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో బ్యాంకులు, నాబార్డు సంస్థలు చురుకైన పాత్ర పోషించాలని కోరారు.

హార్టికల్చర్ రంగానికి మరింత మద్దతు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సీఎం, రైతులకు సులభంగా రుణాలు అందేలా బ్యాంకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాబార్డు సీజీఎం ఎం.ఆర్. గోపాల్, జీఎం కెవిఎస్ ప్రసాద్‌తో పాటు కెనారా బ్యాంక్, ఎస్బీఐ, ఎస్ఎల్‌బిసి, ఏపీజీబీ, ఏపీసీవోబీ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.