Let's talk: editor@tmv.in
‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు

‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు

Panthagani Anusha
27 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో పాలనా సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని గుర్తిస్తూ ప్రముఖ మీడియా సంస్థ ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆయన స్వీకరించారు. శనివారం ముంబైలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

సంస్కరణలకు లభించిన గుర్తింపు

అవార్డు స్వీకరణ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు నూతన ఆవిష్కరణలకు చిరునామాగా మార్చే క్రమంలో ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక మార్పులకు దక్కిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు. ఈ గౌరవాన్ని నేను అత్యంత వినమ్రంగా స్వీకరిస్తున్నాను. ఇది కేవలం నాకు లభించిన గౌరవం మాత్రమే కాదు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు వారి కష్టానికి దక్కిన ప్రతిఫలం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.

పెట్టుబడులే లక్ష్యంగా ముందడుగు

రాష్ట్రంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (సులభతర వాణిజ్యం) మెరుగుపరచడమే కాకుండా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. కేబినెట్ సహచరులు, అధికారులు, విధాన నిర్ణేతలు, పారిశ్రామిక వేత్తల సమిష్టి కృషితోనే ఏపీ ఆర్థికంగా బలోపేతం అవుతోందని ఆయన తెలిపారు.

గవర్నర్ అభినందనలు

ముంబైలో అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి విడుదలైన ప్రకటనలో చంద్రబాబు దార్శనికత, వేగవంతమైన నిర్ణయాలు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయని కొనియాడారు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లనే దేశవ్యాప్తంగా ఏపీకి ఈ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు.