Let's talk: editor@tmv.in
సింహాద్రి అప్పన్న సన్నిధిలో సీఎం చంద్రబాబు..కేంద్ర మంత్రులతో కలిసి ప్రత్యేక పూజలు

సింహాద్రి అప్పన్న సన్నిధిలో సీఎం చంద్రబాబు..కేంద్ర మంత్రులతో కలిసి ప్రత్యేక పూజలు

Panthagani Anusha
29 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సింహాచల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా అప్పన్నను దర్శించుకున్న వారిలో ఉన్నారు.

సింహాచలం పర్యటనకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ సమీపంలోని తార్లువాడలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.15 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 'గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి నేరుగా సింహాచలం చేరుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు, అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రులకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలను అందించి వారిని ఘనంగా సత్కరించారు. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి తరలివస్తుంటారు.

సింహాద్రి అప్పన్న సన్నిధిలో సీఎం చంద్రబాబు..కేంద్ర మంత్రులతో కలిసి ప్రత్యేక పూజలు - Tholi Paluku