Let's talk: editor@tmv.in
కుప్పంలో రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు శ్రీకారం!
కుప్పంలో రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు శ్రీకారం!
కుప్పంలో రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు శ్రీకారం!
కుప్పంలో రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు శ్రీకారం!

కుప్పంలో రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు శ్రీకారం!

Dantu Vijaya Lakshmi Prasanna
6 జులై, 2026

గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసినప్పుడు కలిగిన ఆనందం కంటే, కుప్పంలో ఒకేసారి భారీ సంఖ్యలో పరిశ్రమలకు శ్రీకారం చుట్టడం తనకు మరింత సంతోషాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచస్థాయి కంపెనీలు కుప్పానికి వరుసగా వస్తుండటం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతోందని పేర్కొన్నారు. అడిడాస్ ఫుట్‌వేర్ తయారీ యూనిట్ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ ట్రైనింగ్ విమానాల తయారీ వరకు అత్యాధునిక పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటుకు ముందుకు రావడం గర్వకారణమని చెప్పారు.

గుడుపల్లె మండలం పొగురుపల్లిలో నిర్వహించిన 'స్వర్ణ కుప్పం–పెట్టుబడుల వేదిక' బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని రూ.9,322 కోట్ల పెట్టుబడులతో చేపట్టనున్న పలు పారిశ్రామిక, అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ఇదే వేదికపై కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) ఆధ్వర్యంలో పలు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి. ఈ ఒప్పందాల ద్వారా వేలాది ఉద్యోగాలు, భారీ పెట్టుబడులకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

రూ.9,322 కోట్లతో 30 పరిశ్రమలు

సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కుప్పంలో రూ.9,322 కోట్ల పెట్టుబడులతో మొత్తం 30 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని ప్రకటించారు. వీటి ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ పరిశ్రమలను కుప్పానికి తీసుకురావడం తన లక్ష్యమని, దేశంలోనే ఆదర్శ పారిశ్రామిక నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

కుప్పం చరిత్రలో కొత్త అధ్యాయం

కుప్పం ప్రజలే తనకు శ్రీరామరక్ష అని, ఎక్కడ ఉన్నా తన ఆలోచనలు కుప్పం అభివృద్ధిపైనే ఉంటాయని చంద్రబాబు అన్నారు. ఒకే వేదికపై ఇంత పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రావడం కుప్పం చరిత్రలోనే ప్రత్యేక ఘట్టమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని సీఎం తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్త ఎదగాలని ఆకాంక్షించారు. 44 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కులో ఇప్పటికే 167 పారిశ్రామిక ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కాలేజీ దశ నుంచే యువత ఉద్యోగాల కోసం కాకుండా వ్యాపార అవకాశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1.49 లక్షల మంది డ్వాక్రా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని గుర్తు చేశారు. మహిళా సాధికారతతో పాటు స్వయం ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

కుప్పం అభివృద్ధికి మౌలిక వసతుల బలోపేతం

కుప్పం స్థూల ప్రాంతీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 38 శాతం పెరిగిందని, తలసరి ఆదాయం రూ.2.11 లక్షలకు చేరుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడ్డాయని, డ్రిప్ ఇరిగేషన్ విస్తరణతో పాటు పాల ఉత్పత్తి కూడా పెరిగిందని వివరించారు.

గండికోట నుంచి మరింత నీటిని తరలించి తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుప్పంలో 70 శాతం గ్రీన్ కవర్‌ను పరిరక్షిస్తూ పరిశ్రమల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.

పొగురుపల్లిలో అత్యాధునిక ఇండస్ట్రియల్ టౌన్‌షిప్

పొగురుపల్లిలో అత్యుత్తమ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా భావించిన కుప్పం, నేడు ప్రపంచస్థాయి కంపెనీలు పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న ప్రాంతంగా మారిందని అన్నారు. ఫుట్‌వేర్, ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ, బ్యాటరీలు, బయోటెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాలకు చెందిన పరిశ్రమలు రావడం ఈ ప్రాంత భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుందని అభిప్రాయపడ్డారు.

శంకుస్థాపన రోజే ప్రారంభోత్సవ తేదీ నిర్ణయించండి

కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడి వారి పెట్టుబడులు, ఉత్పత్తి ప్రణాళికలు, నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇస్తూ, శంకుస్థాపన జరిగిన రోజునే పరిశ్రమ ప్రారంభోత్సవ తేదీని నిర్ణయించుకుని ఆ లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి సూచన మేరకు పలువురు పరిశ్రమల ప్రతినిధులు వేదికపైనే తమ యూనిట్ల ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వేగవంతమైన అనుమతులు, సహకారం వల్ల ప్రాజెక్టులను నిర్దేశిత సమయానికి ముందుగానే పూర్తి చేయాలనే ఉత్సాహం కలిగిందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుప్పాన్ని దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక, ఉపాధి, అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు.

మరోవైపు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటనలో భాగంగా, ఉదయం కడపల్లెలోని తన నివాసం వద్దకు చేరుకున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వివిధ సమస్యలపై పలువురు స్థానికులు సమర్పించిన వినతిపత్రాలను స్వీకరించి, వాటిపై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. అనంతరం నలగంపల్లె గ్రామాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ అమలు చేస్తున్న నెట్ జీరో విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలోని పలు ఇళ్లలో ఏర్పాటు చేసిన రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు, ఇండక్షన్ కుక్‌టాప్‌ల వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను పరిశీలిస్తూ ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ గ్రామస్థుని ఇంటికి వెళ్లిన చంద్రబాబు, సోలార్ ప్యానెళ్ల సంఖ్య ఎంత, వాటి ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఇంటి అవసరాలకు పూర్తిగా సరిపోతుందా, అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయిస్తున్నారా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ పొదుపు, సుస్థిర జీవన విధానాలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేయాలని సీఎం సూచించారు.

ట్యాగ్‌లు
ChandrababuNaiduKuppamSwarnaKuppamAndhraPradeshAPDevelopmentInvestmentsIndustrialDevelopmentMSMEEmploymentJobsIndustriesAdidasAIDataCenterMakeInAndhraEconomicGrowthKuppamDevelopmentIndustrialCorridorInvestmentSummitAPNewsAndhraNewsBusinessNewsInfrastructureManufacturingSkillDevelopmentEmploymentGenerationStartupsAPIndustriesChandrababuVisionInvestmentProjects
కుప్పంలో రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు శ్రీకారం! - Tholi Paluku