Let's talk: editor@tmv.in
అమరావతిలో క్వాంటం టెస్ట్ బేడ్స్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతిలో క్వాంటం టెస్ట్ బేడ్స్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Panthagani Anusha
15 ఏప్రిల్, 2026

నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. అత్యాధునిక సాంకేతిక రంగంలో భారత్‌ను స్వయంసమృద్ధి దిశగా నడిపించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటి 'స్వదేశీ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ కింద రూపొందించిన రెండు శక్తివంతమైన టెస్ట్ బెడ్‌లను ఆయన ఆవిష్కరించారు. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో 'అమరావతి 1ఎస్' ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీని గన్నవరంలోని మేధా టవర్స్‌లో 'అమరావతి 1క్యూ' క్వాంటం ఫెసిలిటీని జాతికి అంకితం చేశారు.

క్వాంటం హార్డ్‌వేర్‌లో సరికొత్త అధ్యాయం

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్వాంటం సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచిగా నిలవబోతోందని ఆకాంక్షించారు. ఒకప్పుడు విద్యుత్, ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎలా మార్చాయో భవిష్యత్తులో క్వాంటం టెక్నాలజీ కూడా అదే తరహా విప్లవాన్ని తీసుకురానుంది. ఈ రంగంలో ముందంజలో ఉన్న దేశాలే ప్రపంచాన్ని శాసిస్తాయి అని ఆయన పేర్కొన్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్వాంటం వ్యవస్థలు 'బ్లాక్ బాక్స్' మాదిరిగా ఉండి వాటి అంతర్గత పనితీరు అర్థం కాని స్థితిలో ఉంటే అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు 'ఓపెన్ యాక్సెస్' పద్ధతిలో పనిచేస్తాయని వెల్లడించారు. దీనివల్ల మన శాస్త్రవేత్తలు, విద్యార్థులు నేరుగా హార్డ్‌వేర్ భాగాలను పరీక్షించుకునే వీలుంటుందని వివరించారు.

రికార్డు సమయంలో.. 85 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో

కేవలం ఎనిమిది నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం. ఈ వ్యవస్థలో వాడిన పరికరాల్లో 85 శాతం భాగాలు దేశీయ సరఫరా గొలుసు ద్వారానే రూపొందడం గమనార్హం. మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ వంటి అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద క్రయోజెనిక్ సిస్టమ్స్, ప్రాసెసర్లను పరీక్షించే అత్యాధునిక సదుపాయం ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ సాకారం కావడంలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్‌డీవో వంటి అగ్రగామి సంస్థలు కీలక పాత్ర పోషించాయని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

'స్వర్ణ ఆంధ్ర 2047' దిశగా అడుగులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వర్ణ ఆంధ్ర 2047' లక్ష్యంలో భాగంగా డీప్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా, మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారించామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో 45 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ సాంకేతికత ఔషధ పరిశోధన, వ్యవసాయం, రక్షణ,వాతావరణ అంచనా వంటి రంగాల్లో అద్భుతమైన మార్పులు తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ క్వాంటం మిషన్ ప్రతినిధులు, వివిధ ఐఐటీ ప్రొఫెసర్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు, దేశీయ క్వాంటం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి వేదికగా ప్రారంభమైన ఈ సదుపాయం భవిష్యత్తులో జాతీయ క్వాంటం నెట్‌వర్క్‌కు కేంద్రబిందువుగా మారుతుందని నిపుణులు కొనియాడారు. ఈ ఘట్టంతో గ్లోబల్ క్వాంటం మ్యాప్‌లో అమరావతి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.