
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టిన వినూత్న పరిపాలనా సంస్కరణలు, పారదర్శక విధానాలకు గుర్తింపుగా ప్రముఖ మీడియా సంస్థ ఆయనను “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డుకు ఎంపిక చేసింది. ముంబైలో నేడు రాత్రి జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఈ అవార్డును అందుకున్నారు.
సంస్కరణల స్పీడ్ కు దక్కిన గౌరవం
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ప్రజలకు సత్వర సేవలు అందించేలా రూపొందించిన ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ వంటి కీలక విధానాలను ఈ అవార్డు ఎంపిక కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది. కేవలం విధానాల రూపకల్పనకే పరిమితం కాకుండా కేతికతను జోడించి పరిపాలనలో వేగాన్ని జవాబుదారీతనాన్ని పెంచడంలో సీఎం చూపిన చొరవను కమిటీ కొనియాడింది. ఈ సంస్కరణలు పారిశ్రామిక రంగానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడమే కాకుండా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ఇనుమడింపజేశాయని పేర్కొంది.
అవార్డు స్వీకరణ నిమిత్తం ముఖ్యమంత్రి నేడు మధ్యాహ్నం ముంబై వెళ్లనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.00 గంటకు ఆయన అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.00 గంటల ప్రాంతంలో ముంబై చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు అవార్డుల కార్యక్రమ వేదికకు చేరుకోనుండగా రాత్రి 9.30 గంటలకు ప్రధాన వేదికపై ఆయనకు ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తారు.
ఇదిలా ఉండగా గతంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్విని వైష్ణవ్, ఎస్. జైశంకర్ వంటి దేశ స్థాయి దిగ్గజాలు అందుకున్నారు. ఇప్పుడు అదే వరుసలో చంద్రబాబు నాయుడు నిలవడం విశేషం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఆయన చేస్తున్న కృషికి ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్ పారిశ్రామికాభివృద్ధికి దక్కిన జాతీయ స్థాయి గౌరవంగా దీన్ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
