




ఆంధ్రప్రదేశ్‌లో ‘వీబీ జీ-రామ్-జీ’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంయుక్తంగా రాష్ట్రంలో ‘వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ (వీబీ జీ-రామ్-జీ) పథకాన్ని గురువారం అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె గ్రామంలో జరిగిన ఈ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
దేశవ్యాప్తంగా బుధవారం (జులై 1) నుంచే అమలులోకి వచ్చిన ‘వీబీ జీ-రామ్-జీ’ చట్టం, 2025 కింద అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 125 రోజుల పాటు చట్టబద్ధమైన వేతన ఉపాధిని కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది.
లబ్ధిదారులకు కార్డుల పంపిణీ.. పోర్టల్ ప్రారంభం
ఈ సందర్భంగా ముక్కవారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు పనుల్ని ముగ్గురు నేతలూ లాంఛనంగా ప్రారంభించారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీ జీ రామ్ జీ మిషన్ కింద తొలుత చేపట్టారు. ఈ పథకం కింద స్థానిక లబ్దిదారులకు కేంద్ర మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎంలు కలిసి వీబీజీ రామ్ జీ జాబ్ కార్డులను అందజేశారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్‌లు వీబీ జీ రామ్ జీ ప్రోత్సాహక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం కింద సమాచార బుక్ లెట్, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విడుదల చేశారు. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజివికా మిషన్ పోర్టల్ ను నేతలు ప్రారంభించారు .
125 రోజుల ఉపాధి.. గ్రామాలకు శాశ్వత ఆస్తులు
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధికి ఈ పథకం అత్యంత కీలకమైనదని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 7,700 కోట్ల నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మరో రూ. 4,000 కోట్ల బడ్జెట్ భాగస్వామ్యంతో మొత్తంగా రూ. 11,700 కోట్ల భారీ వ్యయంతో ఈ పనులను చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 125 పనిదినాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఈ పథకం కింద విస్తృతమైన పరిధి ఉంటుందని వివరించారు. ఎక్కడా ఎలాంటి అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతను పాటించేందుకు గాను జియో-ట్యాగింగ్, బయోమెట్రిక్స్ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ పథకం అమలులో పూర్తిగా వినియోగిస్తామని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రం నిధులు పెట్టడం బాధ్యతే
ఈ పథకం కోసం రాష్ట్రాలు నిధులను వెచ్చించడాన్ని భారంలా భావించకూడదని, అదొక సామాజిక బాధ్యత అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని గుర్తు చేస్తూ.. గత కాలంలో రూ. 16,695 కోట్ల వ్యయంతో 55.4 కోట్ల పనిదినాలను సృష్టించామని, తద్వారా 7,000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, లక్షకు పైగా ఫాం పాండ్లు (పంటకుంటలు) నిర్మించడమే కాకుండా గిరిజన ప్రాంతాల్లో 1,373 కిలోమీటర్ల పొడవైన రహదారులను అభివృద్ధి చేశామని వివరించారు. ఇదే ఊపుతో 2026 సంవత్సరానికి గాను మరిన్ని ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ ఏడాది 10,000 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల పొడవైన మ్యాజిక్ డ్రైన్లను నిర్మించడంతో పాటు లక్ష ఎకరాల విస్తీర్ణంలో పండ్ల తోటల (ఆర్చర్డ్స్) పెంపకానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
'మావిగన్'పై జగన్‌కు చంద్రబాబు కౌంటర్
మరోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 2029 ఎన్నికల్లో ‘మావిగన్’ అనే సరికొత్త అంశాన్నే ప్రధాన రాజకీయ అజెండాగా మార్చుకుంటామని జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఎద్దేవా చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల కలయికే ఈ ‘మావిగన్’ అని, దీనిని రాష్ట్ర రాజధాని కారిడార్‌గా ప్రకటించాలని జగన్ ప్రతిపాదిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి రూ. 2 లక్షల కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా అమరావతిని నిర్మించడం ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదని జగన్ విమర్శించారు.
మచిలీపట్నం-విజయవాడల మధ్య 75 కిలోమీటర్లు, విజయవాడ-గుంటూరు మధ్య 40 కిలోమీటర్ల దూరం కలిపి మొత్తం 110 కిలోమీటర్ల పరిధి ఇప్పటికే జాతీయ రహదారి, రైల్వే స్టేషన్లు, రేవు (పోర్టు)తో అనుసంధానమై ఉందని, అందుకే దీనిని క్యాపిటల్ కారిడార్‌గా చేయాలని జగన్ సూచిస్తున్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, "ఎన్నికలకు ముందు ఒకలా మాట్లాడి, ఎన్నికల తర్వాత మరోలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ‘మావిగన్’ రాగం అందుకున్నారు, ఈ రాగం ఎవరికైనా అర్థమైందా?" అని ప్రశ్నిస్తూ, "అమరావతిని ఎవరూ ఆపలేరు" అని ధీమా వ్యక్తం చేశారు.
గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూ, గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేసి, దేశానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సభలో హామీ ఇచ్చారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను (వీఎస్‌పీ) తాము కాపాడుకున్నామని, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రత్యేక రైల్వే జోన్‌ను (సౌత్ కోస్ట్ రైల్వే జోన్) కూడా సాధించామని గుర్తుచేశారు. రాష్ట్రం అభ్యర్థించిన వెంటనే స్పందించి మామిడి రైతులకు అండగా నిలిచినందుకు, రోడ్ల నిర్మాణానికి, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇళ్ల నిర్మాణానికి వెంటనే నిధులను విడుదల చేసినందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల హామీలన్నింటినీ ఇంకా పూర్తిగా నెరవేర్చలేకపోయినప్పటికీ, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చిందని, ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చే ప్రక్రియలో తాము ముందంజలో ఉన్నామని ప్రజలకు భరోసా ఇచ్చారు.
'స్వర్ణ ఆంధ్రప్రదేశ్' లక్ష్యం
ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, 'స్వర్ణాంధ్రప్రదేశ్' (బంగారు ఆంధ్రప్రదేశ్)గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ దిశగా ఇటీవల రాష్ట్రంలో బంగారం నిల్వలు లభ్యమైన ‘జొన్నగిరి’ ప్రాంతాన్ని ప్రభుత్వం ‘స్వర్ణగిరి’గా పునఃనామకరణం చేసినట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి పథం వేగంగా సాగుతోందని, రానున్న రోజుల్లో 'స్వర్ణాంధ్రప్రదేశ్' సాధనను ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.
ఏపీకి నేను మేనమామ - కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్
సీఎం చంద్రబాబుతో కలిసి వీబీ జీ రామ్ జీ పథకం ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకే వీబీజీ రామ్ జీ కింద రూ.7.5 లక్షల కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఏపీకి కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు విడుదల చేస్తామని అన్నారు. స్వయంగా గ్రామ సభలే పంచాయితీలో పనుల్ని నిర్దేశించుకుంటాయని తెలిపారు.
తనను మధ్యప్రదేశ్ లో అంతా మామాజీ అని పిలుస్తారని.. ఇప్పుడు ఏపీకి కూడా తాను మేనమామనే అయ్యానని మంత్రి వ్యాఖ్యానించారు. ఏ మేనమామ ఖాళీ చేతులతో రాడని.. ఏపీకి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి రూ.422 కోట్ల నిధులు ఇవ్వనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంలకు ఆయన అందజేశారు. అలాగే 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేస్తుందని ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా సీఎం చంద్రబాబుకు ఆయన అందజేశారు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఎక్కడా చేయి విడిచి పెట్టేది లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ తమ పుట్టిన రోజున కనీసం ఒక మొక్క నాటేలా సంకల్పం తీసుకోవాలని మంత్రి పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, భారతదేశ భవిష్యత్తు కేవలం నగరాల అభివృద్ధిలోనే లేదని, సంపన్నమైన, సమ్మిళిత అభివృద్ధి సాధించిన గ్రామాల్లోనే దేశం యొక్క నిజమైన బలం దాగి ఉందన్నారు. గ్రామీణ భారతానికి కొత్త శక్తినిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన "వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ" పథకం గ్రామాల అభివృద్ధిలో కీలక మలుపు తిప్పనుందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించాలని కోరగా, వెంటనే అంగీకరించారని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశంలోని గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, గ్రామీణ భారతమే నిజమైన సిరిసంపదలకు కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అందిస్తున్న సహకారం ఎనలేనిదని, వీబీ జీ-రామ్-జీ నిధుల కేటాయింపులో రాష్ట్రానికి దేశంలో మూడో స్థానం దక్కడం కేంద్రం చూపుతున్న ప్రత్యేక చొరవకు నిదర్శనమని అన్నారు.
ఈ పథకం గ్రామీణ భారత భవిష్యత్తుకు ఒక మిషన్‌లా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గతంలో అమలైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పోలిస్తే ఇందులో కీలక సంస్కరణలు తీసుకొచ్చారని, ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం వల్ల గ్రామీణ కార్మికులకు అదనంగా 25 రోజుల ఉపాధి భరోసా లభిస్తుందని చెప్పారు. పంటల సాగు సమయంలో రైతులకు కూలీల కొరత తలెత్తకుండా 60 రోజుల పాటు పథకానికి విరామం ఇచ్చే విధానం రైతులకు మేలు చేస్తుందని వివరించారు.
2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.7,700 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి రూ.12,845 కోట్లు ఈ పథకం కోసం ఖర్చు చేయనున్నామని, ఇది దేశంలోనే మూడో అతిపెద్ద కేటాయింపని పేర్కొన్నారు. గత రెండేళ్లలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.16,695 కోట్లతో 7 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 1,373 గిరిజన గ్రామాల్లో రహదారులు, 1.66 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి, 55.40 కోట్ల పని దినాల కల్పన వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే, ఈ ఏడాది 10 వేల కిలోమీటర్ల డొంక రోడ్లు, 15 వేల కిలోమీటర్ల సీసీ–బీటీ రోడ్లు, 500 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టి గ్రామీణాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే అరవశ్రీధర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు
