


ఏపీలో యోగా ప్రోత్సాహానికి ‘యోగాంధ్ర’ పోర్టల్‌కు సీఎం చంద్రబాబు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగా సాధనను ప్రతి ఇంటికీ చేరవేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సందర్భంగా విజయవాడ లబ్బీపేటలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ‘యోగాంధ్ర’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ వేడుకల్లో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రసిద్ధ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొని స్వయంగా యోగాసనాలు, ప్రాణాయామం చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నిత్య జీవితంలో యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని, తద్వారా ఆసుపత్రులపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందని స్పష్టం చేశారు. యోగా అనేది కేవలం ఒక రోజు చేసే ప్రక్రియ కాదని, అది ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా యోగాను విస్తృతంగా ప్రమోట్ చేసేందుకు సీఎం అనేక కొత్త కార్యక్రమాలను ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని 'స్వర్ణ గ్రామాలు' వార్డు సచివాలయ కార్యాలయాల్లో శాశ్వత యోగా హాళ్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా, మండల స్థాయిలలో యోగా కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తారు. యోగా ప్రాక్టీస్‌కు సంబంధించి ఒక ఖచ్చితమైన, ప్రామాణికమైన నిబంధనావళిని రూపొందించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తారు. యోగాకు సంబంధించిన సమాచారం, శిక్షణను ప్రజలకు సులభంగా అందించేందుకు ప్రత్యేకంగా ‘యోగాంధ్ర పోర్టల్’ను ప్రారంభించనున్నారు. రాబోయే ఏడాది (2027) అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు.
భారతదేశమే ‘విశ్వగురువు’
యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని చొరవతోనే నేడు ప్రపంచంలోని 190 దేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని కొనియాడారు. ప్రపంచానికి సరైన దిశానిర్దేశం చేయగల శక్తి ఒక్క భారతదేశానికే ఉందని, అందుకే మన దేశాన్ని 'విశ్వగురువు' అని పిలుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతికతకు ఆధ్యాత్మికతను జోడించడం ద్వారానే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, యోగా ద్వారానే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన ఆంధ్రప్రదేశ్‌ను సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో గతంలో నిర్వహించిన ‘యోగాంధ్ర-2025’ సాధించిన విజయాన్ని గుర్తుచేస్తూ.. ప్రధానమంత్రి సమక్షంలోనే ఏపీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు పలు ప్రపంచ రికార్డులను సృష్టించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 1.3 లక్షల కేంద్రాలలో ఒక కోటి మందికి పైగా ప్రజలు యోగా సాధన చేస్తున్నారని సీఎం వెల్లడించారు. జంక్ ఫుడ్‌ను పూర్తిగా దూరం పెట్టి, సేంద్రీయ ఆహార అలవాట్లను అవలంబించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ ప్రాజెక్టును అమలు చేసి, అందులో యోగాను ఒక అంతర్భాగం చేస్తామని వివరించారు.
స్టేడియంలో ఆధ్యాత్మిక వాతావరణం – రామ్‌దేవ్ బాబా ప్రశంసలు
ఈ వేడుకల్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు కె. రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు కె. అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్‌లతో పాటు వేలాది మంది విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. వెంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణల మధ్య స్టేడియం మొత్తం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.
యోగా గురువు బాబా రామ్‌దేవ్ స్వయంగా సీఎం చంద్రబాబుకు అనులోమ విలోమ వంటి ప్రాణాయామ ప్రక్రియలను నేర్పించగా, ఆయన శిష్యులు వేదికపై క్లిష్టమైన ఆసనాలను ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు ని 'కర్మయోగి'గా అభివర్ణించిన బాబా రామ్‌దేవ్.. ఆయన గత 30 సంవత్సరాలుగా నిరంతరాయంగా యోగా సాధన చేస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు ఒక విజనరీ సీఎం మాత్రమే కాదని, ఆయన అత్యంత సీనియర్ యోగి అని, ఆయన తనకు ఒక పెద్ద స్ఫూర్తి అని రామ్‌దేవ్ బాబా ప్రశంసించారు.
ఈ వేడుకల్లో పాల్గొన్న అభ్యర్థులు, వైద్యులు మాట్లాడుతూ బాబా రామ్‌దేవ్, సీఎం చంద్రబాబుల సమక్షంలో యోగా చేయడం తమకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ దీనిని దైనందిన అలవాటుగా మార్చుకోవాలని పేర్కొన్నారు. అంతకుముందు శనివారం నాడు కూడా విజయవాడ సమీపంలోని ఉండవల్లి గుహలలో బాబా రామ్‌దేవ్ నేతృత్వంలో జరిగిన ప్రత్యేక యోగా సెషన్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా’ అనే థీమ్‌కు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలలో ఈ ‘యోగాంధ్ర’ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.
