


మత్స్యకారులకు సీఎం చంద్రబాబు ద్రోహం: వై.ఎస్. జగన్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారుల పొట్ట కొడుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన ఆయన, అక్కడి పరిస్థితులను పరిశీలించి మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలోనే జువ్వలదిన్నె హార్బర్ పనులు పూర్తయ్యాయని, ఎన్నికల కోడ్ వల్ల తాము ప్రారంభించలేకపోయామని చెప్పారు. రెండేళ్లు గడుస్తున్నా ఈ హార్బర్‌ను మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
రూ. 26 వేల కోట్లతో నీలి విప్లవం
తమ హయాంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేశామని జగన్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, హార్బర్ ఉండేలా మ్యాపింగ్ చేశామన్నారు. సుమారు రూ.26 వేల కోట్లతో 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. రామాయపట్నం పోర్టు 95 శాతం పూర్తి చేశామని, మూలపేట, మచిలీపట్నం పనులు కూడా వేగంగా జరిగాయని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయని ఆరోపించారు.
మత్స్యకారులను తరిమే కుట్ర
జువ్వలదిన్నె హార్బర్ పరిధిలోని 79 ఎకరాల భూమిలో సగానికి పైగా ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు కేటాయించారని జగన్ ఆక్షేపించారు. మత్స్యకారుల కోసం తాము సేకరించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి, ఇక్కడి వారిని తరిమేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. "చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తున్నా.. మూడేళ్లలో మళ్లీ మా ప్రభుత్వమే వస్తుంది. రాగానే ఆ ప్రైవేట్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తాం. ఈ 10 హార్బర్లు మత్స్యకారుల సొత్తే" అని ఆయన స్పష్టం చేశారు.
బోట్లు దొంగతనం చేసినా అరెస్టులేవీ?
పోలీసులు సీజ్ చేసిన తమిళనాడు బోట్లను తెలుగుదేశం నాయకులు దొంగతనంగా తీసుకెళ్లారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ జలాల్లోకి వచ్చిన బోట్లను మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే, బీదా సోదరులు కుట్ర పన్ని వాటిని తరలించారని విమర్శించారు. ఇందుకు సంబంధించిన కాల్ డేటా సాక్ష్యాలు ఉన్నా, నారా లోకేష్ అండతోనే పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. పోలీసులు సీజ్ చేసిన బంగారాన్ని ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లిపోతే మీరు ఇలాగే విడిచిపెడతారా? అని ఆయన ప్రశ్నించారు.
మత్స్యకారులే బోట్లకు యజమానులు
మత్స్యకారులను యజమానులను చేయాలన్నదే తన లక్ష్యమని జగన్ పేర్కొన్నారు. 1250 మెకనైజ్డ్ బోట్లను గ్రూపులకు ఇవ్వాలని, ఇందులో 10 శాతం మత్స్యకారులు చెల్లిస్తే, 50 శాతం ప్రభుత్వం గ్రాంటుగా ఇచ్చి మిగిలినది లోనుగా ఇప్పించే ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 20 వేల మంది మత్స్యకారులను బోట్ల యజమానులను చేస్తామని హామీ ఇచ్చారు. హార్బర్లలో కోల్డ్ స్టోరేజ్, ఐస్ ప్లాంట్లు వంటి సదుపాయాల ద్వారా మత్స్యకార మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తామన్నారు.
సంక్షేమ పథకాలకు మంగళం
కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జగన్ విమర్శించారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి, ఇప్పుడు విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ, సున్నా వడ్డీ వంటి పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ట్యాబుల పంపిణీ ఆగిపోయిందని, నాసిరకం చదువులు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పంట బీమా అందడం లేదని, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారని దుయ్యబట్టారు.
పట్టపు కార్పొరేషన్ ఏర్పాటుకు హామీ
మత్స్యకారుల వినతి మేరకు తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 'పట్టపు కార్పొరేషన్' ఏర్పాటు చేస్తామని జగన్ కీలక హామీ ఇచ్చారు. గతంలో తాము 56 కార్పొరేషన్లు ఇచ్చి సామాజిక న్యాయం చేశామని, అదే బాటలో పట్టపు సామాజిక వర్గానికి న్యాయం చేస్తామన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, త్వరలోనే ఆయనకు మొట్టికాయలు తప్పవని జగన్ వ్యాఖ్యానించారు.
వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే భరోసా
చివరగా మత్స్యకారులకు భరోసా ఇస్తూ.. "కళ్లు మూసి తెరిచే లోపు మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. ఈ హార్బర్లు, బోట్లు అన్నీ మీ హక్కుగా మీకు అందిస్తాం" అని జగన్ హామీ ఇచ్చారు. జువ్వలదిన్నె హార్బర్ ద్వారా ఏడాదికి 41 వేల టన్నుల మత్స్య సంపద వస్తుందని, ఇది మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన ఆకాంక్షించారు. మత్స్యకారుల పక్షాన తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
