
సాయికృష్ణ తల్లికి సీఎం చంద్రబాబు భరోసా
విజయవాడలో సంచలనం సృష్టించిన యువకుడు గాదె సాయికృష్ణ 'మిస్సింగ్' ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శుక్రవారం ముఖ్యమంత్రిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి, తన కుమారుడి అదృశ్యంపై సమగ్ర విచారణ జరిపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న ఈ ఘటనలో.. కృష్ణలంక పోలీస్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తన కుమారుడిని కస్టడీలో చిత్రహింసలు పెట్టి చంపేశాడని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా అంత్యక్రియలు పూర్తి చేశాడని విజయలక్ష్మి ఆరోపించిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయలక్ష్మిని ఓదార్చి, ఈ మొత్తం ఉదంతంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ కేసులో నిష్పక్షపాతంగా, సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తామని, దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా పట్ల విజయలక్ష్మి సంతృప్తిని వ్యక్తం చేశారని అధికారిక ప్రకటన పేర్కొంది.
