Let's talk: editor@tmv.in
పరిశుభ్రతే పట్టణ అభివృద్ధికి పునాది: ఎమ్మెల్యే సురేంద్ర బాబు

పరిశుభ్రతే పట్టణ అభివృద్ధికి పునాది: ఎమ్మెల్యే సురేంద్ర బాబు

Panthagani Anusha
27 మే, 2026

పట్టణ పరిశుభ్రతను కాపాడటం కేవలం మున్సిపల్ కార్మికుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. పట్టణాన్ని శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

పురపాలక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని వాల్మీకి కూడలిలో నిర్వహించిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా చీపురు పట్టి మున్సిపల్ కార్మికులతో కలిసి రోడ్డును శుభ్రం చేస్తూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ లక్ష్యాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పట్టణాలను అందంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు.

పట్టణంలోని డంప్ యార్డు శుభ్రపరిచే పనులు దాదాపు పూర్తయినప్పటికీ ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను వేరు చేయకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు సహకరిస్తే డంప్ యార్డు ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావచ్చన్నారు.

కాగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం జూన్ 20 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్త వర్గీకరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఏ చెత్తను ఏ డబ్బాలో వేయాలనే విషయంపై ప్రజలకు వివరించి పరిశుభ్ర పట్టణ నిర్మాణంలో భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు.