Let's talk: editor@tmv.in
స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణాంధ్రతోనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్: మంత్రి కొలుసు పార్థసారధి

స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణాంధ్రతోనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్: మంత్రి కొలుసు పార్థసారధి

Gaddamidi Naveen
21 జూన్, 2026

ప్రజల ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ‘స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెంలో జరిగిన పారిశుద్ధ్య కార్యక్రమంలో అధికారులతో కలిసి మంత్రి స్వయంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సంజీవని' కార్యక్రమం ద్వారా ఏటా 60 లక్షల మంది ప్రజలకు ఉచితంగా 41 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మారుమూల గ్రామాల ప్రజల వద్దకే సుమారు రూ. 7 వేల నుంచి రూ. 10 వేల విలువచేసే వైద్య పరీక్షలను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం 904 ప్రత్యేక వాహనాలను రంగంలోకి దించుతోందని మంత్రి తెలిపారు.

ఈ పరీక్షల వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. దీనివల్ల ప్రజలు ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనప్పుడు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నప్పుడు వారి పాత ఆరోగ్య చరిత్ర ను తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్ చేసి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం పారిశుద్ధ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించి, పేరుకుపోయిన చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి, తడిచెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీకి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ద్వారా రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే చెత్త సంపద వాహనాల ద్వారా ప్లాస్టిక్‌ను ప్రభుత్వానికి అందించిన వారికి, ప్రోత్సాహకంగా వారి ఇంటికి నిత్యం అవసరమయ్యే టూత్ పేస్ట్, సబ్బులు వంటి వస్తువులను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.

భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేసి, గుడ్డ సంచులను వాడాలని మంత్రి పిలుపునిచ్చారు. నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ.. ప్రతి 3 నెలల ఒక శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం మంత్రి ప్రజలతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
SwachhAndhraSwarnaAndhraHealthyAndhraPradeshAndhraPradeshPublicHealthSanjeevaniProgramHealthForAllCleanAndhraPlasticFreeAndhra
స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణాంధ్రతోనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్: మంత్రి కొలుసు పార్థసారధి - Tholi Paluku