
గురుకులాలు, హాస్టళ్లలో ‘క్లీన్ అండ్ గ్రీన్’.. జూలై 16 నుంచి కులవృత్తుల మేళా: మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలోని బీసీ గురుకులాలు, హాస్టళ్లలో పరిశుభ్రత, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులకు నిర్దేశించిన మెనూ అమలులో ఎలాంటి రాజీ పడకూడదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభమై 20 రోజులు పూర్తైన నేపథ్యంలో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించిన మంత్రి, విద్యార్థుల సంక్షేమానికి ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. గురుకులాలు, హాస్టళ్లు పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన “క్లీన్ అండ్ గ్రీన్” వాతావరణంలో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన మెనూను అన్ని విద్యాసంస్థల్లో తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజాప్రతినిధులు తరచూ గురుకులాలు, హాస్టళ్లను సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు.
బీసీ స్టడీ సర్కిల్స్‌లో నాణ్యత పెంపు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. సివిల్స్ కోచింగ్‌తో పాటు వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి ప్రాంతాల్లో అమలవుతున్న విజయవంతమైన నమూనాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
జూలై 16 నుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించే కులవృత్తుల మేళాలో అన్ని కులాల సంప్రదాయ వృత్తిదారులకు సమాన అవకాశాలు కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే కుట్టు మిషన్ పథకం అమలుకు సమగ్ర విధివిధానాలు రూపొందించాలని, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను విస్తరించి బీసీలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్‌పై సమగ్ర అధ్యయనం చేసి అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ఐఐటీలు, ఐఐఎంలలో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, గురుకులాల కార్యదర్శి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు అందుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అలాగే కాటమయ్య రక్షణ కవచాల శిక్షణ పూర్తి చేసుకుని కిట్లు అందని జిల్లాల్లో పంపిణీని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
